పద్మశాలులపై నోరెత్తితే ఊరుకోం
- పద్మశాలి సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి
- కేటీఆర్ ప్రోత్సాహంతోనే సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు : పద్మశాలి నాయకులు
రాజన్న సిరిసిల్ల 29 సెప్టెంబర్ (విజయక్రాంతి): సిరిసిల్ల పద్మశాలి సమాజాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మశాలి సమాజ నాయకులు (Padmashali community leaders)డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలువురు పద్మశాలి నాయకులు మాట్లాడుతూ గతంలో కేటీఆర్ సైతం సిరిసిల్ల పద్మశాలి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యల ప్రభావంతోనే ఆయన అనుచరులు కూడా పద్మశాలి సమాజాన్ని, సిరిసిల్ల ప్రాంతాలను కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన, బహిరంగ సభపై అందరి దృష్టి ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజం మనోభావాలను దెబ్బతీయడమేనని వారు అన్నారు. పద్మశాలి సమాజాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తితో పాటు, ఆయనను ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
పద్మశాలి సమాజం మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలపై కేటీఆర్ వెంటనే స్పందించి సిరిసిల్ల పద్మశాలి సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గోలి వెంకటరమణ, పంతం రవి, సోమిశెట్టి దశరథం, మోర రవి, రామకృష్ణ ద్యావనపల్లి, నాగుల శ్రీనివాస్, చుంచు ప్రకాష్, మిట్టపల్లి రాయమల్లు, గజ్జెల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.