రైతులకు అండగా కొనుగోలు కేంద్రాలు..
పట్టభద్రుల ఓటరు నమోదుపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి!
ఆలేరు, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించేలా ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Bhongir MLA Kumbham Anil Kumar Reddy) అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
శుక్రవారం బీబీనగర్, వలిగొండ మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రైతుల సమస్యలు, పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించారు. రైతులకు భరోసా.. మూడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం బీబీనగర్ మండలం కొండమడుగు, రాఘవపూర్, బ్రహ్మాణపల్లి గ్రామాల్లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, తూకం, గన్నీ బ్యాగులు, రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా, రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీబీనగర్ పట్టణం, వలిగొండ మండల కేంద్రాల్లో జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం, ఇప్పటివరకు నమోదైన ఓటర్ల వివరాలు, పురోగతిపై ఆరా తీశారు. అర్హులైన పట్టభద్రులెవరూ ఓటు హక్కును కోల్పోకుండా విస్తృతంగా అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు. ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
యాదాద్రికి మరో ప్రత్యేక ఆకర్షణ.. స్వాగత తోరణానికి పూజలు
భువనగిరిలోని రాయగిరి కమాన్ వద్ద యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు, సందర్శకులకు స్వాగతం పలికేలా నిర్మించనున్న నూతన స్వాగత తోరణం పనులకు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. యాదాద్రి దేవస్థానం బోర్డు చైర్మన్ ఎం.ఎస్.ఎన్. రెడ్డి, పాలక మండలి సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చైర్మన్ ఎం.ఎస్.ఎన్. రెడ్డి తన సొంత నిధులతో స్వాగత తోరణం నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యాదాద్రి క్షేత్ర ఆధ్యాత్మిక వైభవానికి, ప్రాశస్త్యానికి తగ్గట్టుగా నిర్మాణం చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో PACS చైర్మన్ పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, మండల అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి, PACS వైస్ చైర్మన్ వాకిటి చంద్రశేఖర్ రెడ్డి, గోలి పింగల్ రెడ్డి, గోలి నరేందర్ రెడ్డి, గడ్డం బాల్ రెడ్డి, స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. స్వాగత తోరణం కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.