గుడ్ టచ్-బ్యాడ్ టచ్’ గురించి అవగాహన

30-10-2026 | 07:21pm
  1. చట్టాలపై అవగాహన అవసరం
  2. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి చండీశ్వరి 

ములుగు, అక్టోబర్ 30 (విజయక్రాంతి): బాల బాలికలకు బ్యాడ్ టచ్ గుడ్ టచ్పై(Bad touch good touch) అవగాహన అవసరం అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(District Legal Services Authority) కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి చండీశ్వరి అన్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్వహిస్తున్న సురక్షిత్ బచ్ పన్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ.

ములుగు ఆధ్వర్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో శుక్రవారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బాల, బాలికలకు సురక్షిత స్పర్శ, అసురక్షిత పోక్సో చట్టం - 2012 లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను మొదటి దశలో భాగంగా ఏటూరునాగారం మండలంలోని మొత్తం 12 వివిధ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, గురుకుల  పాఠశాలల్లో నిర్వహించడం జరిగింది.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి చండీశ్వరి చిన్నబోయినపల్లి లోని బాలుర ఆశ్రమ పాఠశాల, కేజీబీవీ ఎటూరునాగారం, జెడ్పిఎస్ఎస్ రామన్నగూడెం, ఆశ్రమ బాలికల పాఠశాల ఆకుల వారి ఘనపూర్ లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సురక్షిత స్పర్శ, అసురక్షిత స్పర్శపై చిన్నారులు అవగాహన కలిగి ఉండాలి, తద్వారా ప్రతి బాలుడు, ప్రతి బాలిక సురక్షితంగా ఎదగాలనీ అన్నారు. సరైన అవగాహనతోనే మన చుట్టూ ఉన్న ప్రమాదకర పరిస్థితులను సులభంగా దాటి ముందుకు వెళ్లగలమని అన్నారు.

పిల్లల భద్రత, వ్యక్తిగత హక్కులు, శరీరంపై స్వీయ నియంత్రణ, లైంగిక వేధింపుల నుంచి రక్షణ వంటి అంశాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. బాలల రక్షణ కోసం రూపొందించిన చట్టాలు, ముఖ్యంగా లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

బాలలపై లైంగిక వేధింపులను అరికట్టడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మరో ముఖ్య అతిథి జిల్లా సంక్షేమ అధికారి ఈపి ప్రేమలత మాట్లాడుతూ అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా వ్యక్తిగత భద్రత, శరీర హద్దులు, ఇతరుల పట్ల గౌరవం, సమ్మతి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు.

పిల్లలు తమకు ఎదురైన సమస్యలను స్వేచ్ఛగా వెల్లడించగలిగే సురక్షితమైన వాతావరణాన్ని కుటుంబంలో, విద్యాసంస్థల్లో కల్పించాలని అన్నారు. బాలల రక్షణకు సంబంధించిన ఏదైనా సమస్య ఎదురైనప్పుడు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ను, అత్యవసర పరిస్థితుల్లో 112ను సంప్రదించి సహాయం పొందవచ్చని వివరించారు.

అనంతరం జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలోనే వినూత్నంగా మాట్లాడే బొమ్మతో పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా తమ శరీరం ఏ చోట తాకితే సురక్షిత స్పర్శ, ఏ చోట తాకితే అసురక్షిత స్పర్శ అనే విషయాన్ని ప్రదర్శించగా, బొమ్మను అసురక్షితంగా తాకినప్పుడు ఇది చెడు స్పర్శ, ఇక్కడ ఎవ్వరినీ తాకనివ్వరాదని, ఎవరైనా అసభ్యకరంగా తాకితే వెంటనే అక్కడి నుండి పరుగెత్తాలని వివరించింది.

ఫోక్సో-2012, బాల్య వివాహ నిషేధ చట్టం 2006లోని ముఖ్యమైన అంశాలను మాట్లాడే బొమ్మ ద్వారా సమగ్రంగా పిల్లలను ఆకట్టుకునేలా వివరించడం జరిగింది. ఎవరైనా ఇబ్బందికరంగా వ్యవహరిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లేదా 112 టోల్ ఫ్రీ కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుండి చీఫ్ లీగల్ ఎయిడ్ మేకల మహేందర్, ఏటూరునాగారం 2వ ఎస్సై బోధి కాంతారావు, ఏహెచ్టియు ఎస్ఐ మౌనిక, భరోసా ఎస్సై రాజ్యలక్ష్మి, మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగము, చైల్డ్ హెల్ప్ లైన్, మహిళా సాధికారత కేంద్రం, సఖి విభాగాలకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, ఉపాద్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు