మృతుడి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం
స్నేహబంధాన్ని చాటుకున్న మిత్రులను అభినందించిన గ్రామ పెద్దలు
తిరుమలాయపాలెం అక్టోబర్ 30 (విజయ క్రాంతి): తిరుమలాయపాలెం(Tirumalayapalem) మండల పరిధిలోని మేడిదిపళ్లి గ్రామంలో(Medidipalli Village) మిత్రుడి మరణవార్త విని బాల్యస్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. మేడిదపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ చిలకబత్తిని ముత్తయ్య (రాజు) పార్థివదేహాన్ని ఆయన పదో తరగతి సహచరులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
చిన్ననాటి నుంచి కలిసి చదువుకుని, ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచుకున్న స్నేహితుడు ఆకస్మికంగా మృతి చెందడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ముత్తయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో పదో తరగతి వరకు కలిసి చదువుకున్న బాల్యమిత్రులంతా కలసి రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
స్నేహితుడు దూరమైనా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆపద సమయంలో మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించిన బాల్యమిత్రులను మేడిదపల్లి గ్రామ పెద్దలు అభినందించారు. స్నేహం అంటే కేవలం కలిసి ఉండటమే కాదు.. కష్టసమయంలో ఒకరికొకరు అండగా నిలవడమేనని బాల్యమిత్రులు తమ చేతలతో నిరూపించారు.