తెలంగాణ రక్షణ సేనలోకి రాఘవపురం నేతలు
- కవిత పంచజన్యాల నినాదానికి ఆకర్షితులై చేరిక
- ఉచిత విద్య, వైద్యం.. రైతు సంక్షేమం, ఉపాధికి ప్రాధాన్యం
మోతె, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మోతె మండలం రాఘవపురం ఎక్స్‌రోడ్‌కు చెందిన పలువురు నాయకులు తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)(Telangana Rakshana Sena) పార్టీలో చేరారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించిన పంచజన్యాల నినాదానికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు కుందూరు దేవేందర్‌రెడ్డి, కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా సంజీవరావు నాయక్, మండల నాయకుడు ధరావత్ కృష్ణ సమక్షంలో పార్టీ కండువాలు కప్పి కొత్తగా చేరిన నాయకులను ఆహ్వానించారు.ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం అనే ఐదు అంశాలే పంచజన్యాలని నాయకులు వివరించారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి బిడ్డకు ఉచిత విద్య, అన్ని ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. వ్యవసాయాన్ని బలోపేతం చేసి రైతును రాజుగా చేయడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.తెలంగాణ ఉద్యమకారులకు లక్ష ఉద్యోగాలు, మిగతా మూడు లక్షల ఉద్యోగాలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.
స్వయం ఉపాధి కోరుకునే యువతకు బ్యాంకుల ద్వారా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే ప్రణాళిక ఉందన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలకు సమానంగా సంక్షేమ ఫలాలు అందించి సామాజిక న్యాయం సాధించడమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.పార్టీలో చేరిన వారిలో సీనియర్ నాయకులు కారింగుల శ్రీనివాస్ గౌడ్, బొర్రాజు రాములు యాదవ్,
మద్ది శాంతమ్మ, మాజీ ఎంపీటీసీ భానోత్ మధు నాయక్, ఆటో యూనియన్ అధ్యక్షుడు పాలకురి శ్రీనివాస్ గౌడ్, కుంచం శ్రీహరి, యువ నాయకులు కారింగుల కిరణ్ గౌడ్, షేక్ ఖాన్ తదితరులు ఉన్నారు.