'మన పోలీస్ - మన ఊరు'తో చట్టాలపై అవగాహన

27-10-2026 | 08:13pm

- సీపీ రష్మీ పెరుమాళ్ 

- ఇందుప్రియాల్ సీసీ కెమెరాల ప్రారంభం

సిద్దిపేట క్రైం, అక్టోబర్ 27: నేరాలు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికే "మన పోలీస్ - మన ఊరు" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీపీ రష్మీ పెరుమాళ్(CP Rashmi Perumal) పునరుద్ఘాటించారు. మన పోలీస్ - మన ఊరు కార్యక్రమంలో భాగంగా మంగళవారం దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు కోలాటంతో, బంజారా గిరిజనులు వారి సంప్రదాయ నృత్యాలతో సీపీకి ఘన స్వాగతం పలికారు.

అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన 16 సీసీటీవీ కెమెరాలను, గ్రామ గ్రంథాలయాన్ని ఆమె ప్రారంభించారు. స్థానిక గ్రంథాలయం ఆవరణ గోడలపై, ప్రభుత్వ పాఠశాల గోడలపై గీసిన ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన చిత్రాలను  పరిశీలించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు వేసిన ట్రాఫిక్ భద్రత, డ్రగ్స్ నిర్మూలన, సైబర్ క్రైమ్ థీమ్ రంగోలి పోటీలను తిలకించి అభినందించారు. పాఠశాల విద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులతో సీపీ  ముచ్చటించారు.

గ్రామ యువత, పోలీస్ టీమ్‌కు మధ్య జరిగిన వాలీబాల్ మ్యాచ్‌కు సీపీ టాస్ వేసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదికపై రోడ్డు భద్రత, డ్రగ్స్ మహమ్మారిపై లఘు చిత్రాలను ప్రదర్శించారు.  విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు, సామాజిక అవగాహన స్కిట్లు ఆకట్టుకున్నాయి. నేరస్థులను పట్టుకోవడానికి సీసీటీవీ కెమెరాలు దోహదపడతాయని సీపీ చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సీఐ శ్రీను, ఇన్స్పెక్టర్ లతీఫ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ విష్ణుప్రసాద్, ఎస్ఐలు అరుణ్, నవీన్, బాలకృష్ణ, రేణుక, ఆర్ఎస్ఐ బాలకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు