యువతను సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ, అక్టోబర్ 27 (విజయ క్రాంతి):యువతను పలు సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి(District Collector Chahat Bajpai) మై భారత్ కో ఆర్డినేటర్లు, ఇతర అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మై భారత్ కో ఆర్డినేటర్లు, అధికారులతో యువత కు సంబంధించిన అంశాలు, హనుమకొండ లోని యూత్ హాస్టల్ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మై భారత్ పోర్టల్ లో ఎంతమంది యువత నమోదు అయ్యి ఉన్నారు, మై భారత్ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలను గురించి కలెక్టర్ మై భారత్ జిల్లా అధికారి భూక్యా సంజీవ్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టీబీ ముక్త్ భారత్, తదితర సామాజిక కార్యక్రమాలలో మై భారత్ వాలంటీర్లు, యువతను భాగస్వాములను చేయాలన్నారు.
శిక్షణకు వచ్చిన మై భారత్ అధికారులు చారిత్రక వరంగల్ జిల్లాలో వేయి స్తంబాల దేవాలయం, రామప్ప, మేడారం, కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువులు,ఆలయాలను సందర్శించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా హనుమకొండలోని యూత్ హాస్టల్ లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతామన్నారు. యూత్ హాస్టల్ లో వసతులు మెరుగ్గా ఉండేలా యువతకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
శిక్షణలో భాగంగా జిల్లాకు వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన మై భారత్ అధికారులు సుమీ సింగ్, విజయ్ సూర్య, ప్రశాంత్ కుమార్, యష్ మహేశ్వరి, అనూష పారిక్, అబ్దుల్లా అహ్మద్, మెహుల్ బాబూ భాయ్ లతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026-2027 పోస్టర్లను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో మై భారత్ జిల్లా అధికారి భూక్యా సంజీవ్, జాతీయ యువజన అవార్డు గ్రహీత మండల పరశురాములు, ఆర్ అండ్ బి డీఈ గోపీ కృష్ణ, ఏఈ ఉదయ్, క్రీడల శాఖ నుండి మౌనిక, పింగళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ రత్నమాల రమా, డాక్టర్ మమత, తదితరులు పాల్గొన్నారు.