వాట్సాప్ ఆర్డర్లు.. రాపిడో డెలివరీలు!
హైదరాబాద్: నగరంలో ఈ-సిగరెట్ల(E-Cigarette) విక్రయాలపై ఈగల్ ఫోర్స్(Eagle Force) అధికారులు కొరడా ఝళిపించారు. సైనిక్‌పురిలోని ‘ది స్మోక్ షాప్’పై కుషాయిగూడ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. తనిఖీల్లో 39 ఈ-సిగరెట్లు, పేమెంట్ స్కానర్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు సరఫరా
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ-సిగరెట్లను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేసినట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. నగరంలో వీటి విక్రయాల కోసం ప్రత్యేకంగా ఆర్డర్లు తీసుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు.
వాట్సాప్‌లో ఆర్డర్లు.. రాపిడో ద్వారా డెలివరీలు
వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, రాపిడో సేవలను ఉపయోగించి కస్టమర్లకు ఈ-సిగరెట్లు చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. గత నెల 3 నుంచి 26 వరకు ఈ తరహా డెలివరీలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఈ వ్యవహారంలో నగరానికి చెందిన సుమారు 45 మంది వినియోగదారులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
రూ.10 కోట్ల లావాదేవీలపై ఆరా
ఈ-సిగరెట్ల విక్రయాల వెనుక సుమారు రూ.10 కోట్ల విలువైన లావాదేవీలు జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లు, పేమెంట్ స్కానర్ ఆధారంగా ఆర్థిక లావాదేవీలు, సరఫరా మార్గాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఏడు దుకాణాలు, అవుట్లెట్లలో తనిఖీలు
ఈ-సిగరెట్ల విక్రయాలపై నిఘా పెంచిన ఈగల్ ఫోర్స్ అధికారులు నగరంలోని ఏడు దుకాణాలు, అవుట్లెట్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు, సరఫరాదారుల వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.