రైల్వే సమస్యలపై అదికారులతో భీమా శ్రీధర్ చర్చలు
- భద్రాచలం రోడ్ స్టేషన్ అభివృద్ధికి వినతి
- నిలిచిన రైళ్ల పునరుద్ధరణ..
- ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి
కొత్తగూడెం, అక్టోబర్ 27 ( విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైల్వే ప్రయాణికులు(Railway passengers) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, రైల్వే సౌకర్యాలను మెరుగుపరచాలని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీఆర్యూసీసీ) సభ్యుడు భీమా శ్రీధర్(Bhima Sridhar) కోరారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను కలిసి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు ప్రాంతంలోని పలు రైల్వే సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు.
ప్రయాణికుల సమస్యలు అధికారుల దృష్టికి
దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ మల్లాడి, అసిస్టెంట్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏ. సంజీవరావు, చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్ రవిచంద్రన్, ఎస్టీఎం/రూల్స్ రాజనర్సును కలిసి భద్రాద్రి ప్రాంత ప్రయాణికుల సమస్యలను వివరించారు.
భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కొత్త రైళ్ల ఏర్పాటు, కోవిడ్ సమయంలో నిలిపివేసిన రైళ్ల పునరుద్ధరణ, రైళ్లలో అదనపు కోచ్ల ఏర్పాటు, ప్రాంతానికి మెరుగైన రైల్వే కనెక్టివిటీ కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా, పర్యాటకపరంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు గనులు, పారిశ్రామిక సంస్థలు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ,రైల్వే సౌకర్యాలను విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంత ప్రజల ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.