చనిపోతేనే పనులవుతాయా?: హరీశ్ రావు
సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు(BRS MLA Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. రేషన్ డీలర్ల సమస్యల(Ration Dealers Issues)ను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పౌరసరఫరాల సంస్థ అప్పులు, బియ్యం నిల్వల నిర్వహణ, డీలర్ల వేతనాల అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
పౌరసరఫరాల కార్పొరేషన్(Civil Supplies Corporation)ను భారీ అప్పుల్లోకి నెట్టారని హరీశ్ రావు విమర్శించారు. సంస్థపై లక్ష కోట్ల రూపాయల అప్పుల భారం పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని ఆరోపించారు. అలాగే, రూ.600 కోట్ల విలువైన బియ్యం వృథా అయిందని పేర్కొంటూ నిల్వల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తారు.
రాష్ట్రంలో 17,200 మంది రేషన్ డీలర్లకు వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. డీలర్లకు నెలకు రూ.5 వేల వేతనం ఇస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రేషన్ డీలర్ల సమస్యలపై చర్చించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడేళ్లుగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
రేషన్ డీలర్లతో వివాదాలు పెట్టుకున్న ప్రభుత్వాలు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డీలర్ల సంఘం ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించాలని సూచించారు. డీలర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసి, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.