ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

27-10-2026 | 08:16pm

ఇల్లెందు, అక్టోబర్ 27 (విజయక్రాంతి): క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వరూప కాటం(Principal Junior Civil Judge Swaroopa) అన్నారు. ఖైదీలు గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని, భవిష్యత్తులో మళ్లీ అలాంటి తప్పులు చేయకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. మంగళవారం సాయంత్రం ఇల్లందు పట్టణంలోని సబ్‌జైలును ఆమె సందర్శించి ఖైదీలతో మాట్లాడారు.

అనంతరం జైలు రికార్డులు, వంటశాల, ములాఖత్‌ గదులు, పరిసరాలను పరిశీలించారు. ఖైదీలకు అందిస్తున్న ఆహార మెనూను తనిఖీ చేశారు. ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచిత న్యాయ సహాయ కేంద్రం ద్వారా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రతినిధి కీర్తి కార్తిక్, సబ్‌జైలు చీఫ్ బి.ఉదయ్ కుమార్, హెడ్ వార్డెన్లు భుజరంగరాజు, సాంబ, శ్రీనివాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు