ఊరువాడా వాల్మీకి నామస్మరణ..

26-10-2026 | 10:53pm

రాయికోడ్‌లో ఘనంగా శోభాయాత్ర!

మండలవ్యాప్తంగా ఆదికవి జయంతి వేడుకలు.. డీజే పాటలతో యువకుల సందడి

రాయికోడ్‌ (విజయక్రాంతి): ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి(Valmiki Jayanti) వేడుకలు సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండల వ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు నల్లంపల్లి, మహ్మదాపూర్‌, పిప్పడ్‌పల్లి, కర్చల్‌, హస్నాబాద్‌, కుస్నూర్‌, ఇటికేపల్లి, జాంబిగి (కె) తదితర గ్రామాల్లో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాలు ఎగురవేసి, వాల్మీకి మహర్షి చిత్రపటాలు, విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నివాళులర్పించారు.

మండల కేంద్రమైన రాయికోడ్‌లో వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహంతో గ్రామ పురవీధుల గుండా అట్టహాసంగా శోభాయాత్ర చేపట్టారు. ముదిరాజ్‌ కులస్తులు, యువకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను వైభవంగా నిర్వహించారు. డీజే పాటల హోరులో యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, టపాసులు పేలుస్తూ శోభాయాత్రలో సందడి చేశారు. ఊరంతా వాల్మీకి మహర్షి నామస్మరణతో మార్మోగింది.

అనంతరం మహర్షికి మహాహారతి సమర్పించి, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.ధర్మం, నీతికి ప్రతీక రామాయణం ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు పలువురు మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం మానవాళికి ధర్మం, నీతి, సత్యం, ఆదర్శ జీవన విలువలను బోధించే మహాగ్రంథమని పేర్కొన్నారు. శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ధర్మమార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. వాల్మీకి మహర్షి ఆశయాలను భావితరాలకు అందిస్తూ, ఆయన బోధనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఇటికేపల్లి సర్పంచ్‌ తమ్మలి రాజు ముదిరాజ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చేవెళ్ల విఠల్‌ ముదిరాజ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు నాగరాజ్‌ ముదిరాజ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కేదారనాథ్‌ పాటిల్‌, స్థానిక ఉపసర్పంచ్‌ ఆర్‌. శివకుమార్‌, ఎండోమెంట్‌ మాజీ చైర్మన్‌ సతీష్‌ కులకర్ణి, వరం సొసైటీ మాజీ వైస్‌ చైర్మన్‌ తుకారాం, సంఘం నాయకులు నాట్కరి మానయ్య, గువ్వ నారాయణ, పుర్రె సంగమేశ్‌, అంజి, మానిక్‌, లాలప్ప తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు