బతుకమ్మ సంబరాలతో మారుమోగిన శ్రీ గాయత్రి పాఠశాల
నాగల్‌గిద్ద, అక్టోబర్ 9 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలంలోని(Nagalgidda Mandal) శ్రీ గాయత్రి పాఠశాలలో(Sri Gayatri School) శుక్రవారం బతుకమ్మ సంబరాలు(Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూల పరిమళాలు, బతుకమ్మ పాటలు(Bathukamma Songs), చిన్నారుల కేరింతలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వివిధ రకాల పూలతో అందమైన బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ విద్యార్థులు ఉత్సాహంగా ఆడిపాడారు. చిన్నారుల ఆటపాటలతో పాఠశాల ప్రాంగణమంతా సందడిగా మారింది.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ హనుమంతరావు పాటిల్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు మన పండుగల విశిష్టతను తెలియజేయడం ఎంతో అవసరమన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థుల్లో ఐక్యత, సృజనాత్మకత, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందుతాయని తెలిపారు. భావితరాలకు తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని అందించడమే లక్ష్యంగా పాఠశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.