ఎమ్మెల్యే గాంధీకి ఈడీ పిలుపు?

25-09-2026 | 01:24pm

- రూ.2.1 కోట్ల లావాదేవీలపై వివరణ కోరినట్లు సమాచారం

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(Sahithi Infratech Ventures India Private Limited)కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ(MLA Arekapudi Gandhi)కి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెల 27న విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. సాహితి ఇన్‌ఫ్రాకు సంబంధించిన సుమారు రూ.2.1 కోట్ల నిధులు ఎమ్మెల్యే బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ అయినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఈ లావాదేవీల ఉద్దేశం, నిధుల మూలం, వినియోగం తదితర అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈడీ సమన్ల వ్యవహారంపై ఎమ్మెల్యే కార్యాలయం భిన్నంగా స్పందించింది. ఎమ్మెల్యే పీఏ గంగుల రమేష్‌ తమకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారని తెలిపారు. సాహితి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడుల పేరుతో కొనుగోలుదారుల నుంచి నిధులు సేకరించి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లావాదేవీల అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈడీ అధికారికంగా వెల్లడించే వివరాలతోనే సమన్ల వ్యవహారంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు