బోయిన్‌పేటలో పోలీసుల ఉక్కుపాదం

06-10-2026 | 07:02pm

గుడుంబాపై కొరడా.. 110 లీటర్లు స్వాధీనం

35 బైక్‌లు సీజ్

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

గోదావరిఖని ఏసిపి మడత రమేష్ హెచ్చరిక

మంథని, అక్టోబర్ 5 (విజయక్రాంతి): అక్రమ మద్యం, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై మంథని పోలీసులు కొరడా ఝుళిపించారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్(ACP Madatha Ramesh) ఆధ్వర్యంలో మంథని మున్సిపల్ పరిధిలోని  బోయిన్‌పేట గ్రామంలో సోమవారం రాత్రి కమ్యూనిటీ కాంటాక్ట్, నాకాబందీ నిర్వహించి విస్తృత తనిఖీలు చేపట్టారు.

గుడుంబా తయారీ, విక్రయాలపై దృష్టి సారించిన పోలీసులు 110 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని మూడు కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ద్విచక్ర వాహనాలపై కూడా చర్యలు తీసుకుని 35 బైక్‌లను స్వాధీనం చేసుకుని, 8 పెట్టీ కేసులు నమోదు చేశారు.

తనిఖీల అనంతరం ఏసీపీ గ్రామస్థులతో మాట్లాడి అక్రమ మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో మంథని సీఐ గుద్దే స్వామి తో పాటు మంథని ఎస్ఐ సందీప్ కుమార్, ముత్తారం ఎస్సై రవికుమార్, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్స్,  కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు