అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
ఎంపీడీవో దివ్య దర్శన్ రావు ఆధ్వర్యంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు
సుల్తానాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ లో బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) అంబరాన్ని అంటాయి, సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీవో దివ్య దర్శన్ రావు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆటలు ఆడారు, మండల పరిషత్ లో ఎంపీడీవో దివ్య దర్శన్ రావు(MPDO Divya Darshan Rao) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకలకు డి ఎల్ పి ఓ దేవకి దేవి హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొని ఆడి పాడారు.
అనంతరం పలువురు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన బతుకమ్మ వేడుక ప్రకృతిలో లభించే తీరక పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ఒకచోట ఏర్పాటు చేసి మహిళా మణులు చుట్టూ వలయకారంగా తిరుగుతూ తెలంగాణ పాటలను వల్లేవేస్తూ ఆనందంగా ఆడి పాడారు. సంవత్సరానికి ఒకసారి నిర్వహించే వేడుకలు తెలంగాణ మహిళలోకం అత్యంత వైభవంగా చేపడుతుందని తెలిపారు.
పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ వేడుకని బతుకు నిచ్చే బతుకమ్మలో గౌరమ్మను పేర్చి ఆడపడుచులు తమ పసుపు కుంకుమలను వాయనంగా అందించుకునే అత్యంత పవిత్రమైన పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. అలాగే మండలంలోని అల్లిపూర్ గ్రామంలో సర్పంచ్ కోదాటి సాయికిరణ్ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో వేడుకలు ఉత్సాహంగా కొనసాగాయి , ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో సంజీవరావు, మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య తో పాటు మండలంలోని సర్పంచులు వివిధ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.