డిండి ప్రాజెక్టుపై రాద్ధాంతం తగదు

17-10-2026 | 10:43pm

- టెండర్లు ఖరారైన తర్వాత ప్రాజెక్టును రద్దు చేయాలని కోరడం అన్యాయం

- ఏదుల నుంచే నీటి తరలింపు పనులు పూర్తి చేయాలి

- మంత్రి జూపల్లి కృష్ణారావుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఐలయ్య యాదవ్ లేఖ

మునుగోడు, అక్టోబర్ 17 (విజయక్రాంతి): డిండి ప్రాజెక్టుకు(Dindi Project) ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే అంశంపై అనవసర వివాదాలు సృష్టించడం తగదని , టెండర్లు ఖరారైన తర్వాత ప్రాజెక్టును రద్దు చేయాలని కోరడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జక్కలి ఐలయ్య యాదవ్(Congress party state leader Jakkali Ailaiah Yadav) అన్నారు. కేబినెట్‌లో తీర్మానం చేసి, పనులకు అనుమతులు ఇచ్చిన తర్వాత అదే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడటం సరికాదని మంత్రి జూపల్లి కృష్ణారావుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

మునుగోడు, దేవరకొండ ప్రాంతాలు ఫ్లోరైడ్ సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయని, ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డిండి రిజర్వాయర్ల పనులను ప్రారంభించినప్పటికీ, నీటిని ఎక్కడి నుంచి తరలించాలనే అంశాన్ని తేల్చలేకపోయిందని విమర్శించారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కృషితోపాటు జిల్లా మంత్రుల సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

కాలువలు, హెడ్‌వర్క్స్, టన్నెల్ నిర్మాణానికి రూ.1,800 కోట్లు మంజూరు చేసి, టెండర్లు ఖరారైన తర్వాత ప్రాజెక్టును రద్దు చేయాలని కోరడం అన్యాయమన్నారు.శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి నార్లాపూర్‌ మీదుగా నీటిని తరలించాలనే ప్రతిపాదనపై ఇప్పటికే సర్వేలు, సాంకేతిక పరిశీలనలు జరిగాయని తెలిపారు. అటవీ అనుమతులు, టన్నెల్ నిర్మాణ సమస్యలతోపాటు సుమారు రూ.10 వేల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే మార్గమే అనుకూలమని నిర్ణయించినట్లు, 2025 జనవరి 22న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు.

పాలమూరు ప్రాంతానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఈ అంశంపై వివాదాలు సృష్టించడం వల్ల రెండు జిల్లాల మధ్య జల వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల మునుగోడు, దేవరకొండ ప్రాంతాల ప్రజలకు నీరు అందకుండా పోకూడదని అన్నారు.కేబినెట్‌ నిర్ణయానికి అనుగుణంగా ఏదుల రిజర్వాయర్‌ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు అవసరమైన భూసేకరణ, హెడ్‌వర్క్స్‌, టన్నెల్‌, కాలువ నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని ఐలయ్య యాదవ్ డిమాండ్ చేశారు. కేబినెట్‌ మంత్రిగా ఈ ప్రాజెక్టు పూర్తికి మంత్రి జూపల్లి కృష్ణారావు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు