రైతుల కోసం తుమ్మల డిమాండ్లు
తెలంగాణలో 315 మండలాల్లో కరువు.. కేంద్రానికి తుమ్మల కీలక విజ్ఞప్తి
హైదరాబాద్: తెలంగాణలో కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు తక్షణ సహాయం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Minister Shivraj Singh Chouhan) నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’(Khet Bachao Abhiyan) వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలోని వ్యవసాయ రంగ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలోని 315 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నందున రైతులను(Farmers) ఆదుకునేందుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహం అందించడంతో పాటు మధ్యంతర పంటల సాగుకు అవసరమైన విత్తనాలపై ఆర్థిక సహాయం అందించాలని కోరారు. మొక్కజొన్న, జొన్న సహా ఇతర పంటలకు 100 శాతం మద్దతు ధర కల్పించాలని మంత్రి ప్రతిపాదించారు.
ధరల మద్దతు పథకం కింద ప్రస్తుతం ఉన్న 25 శాతం కొనుగోలు పరిమితిని తొలగించి, రైతులకు మరింత ప్రయోజనం కలిగించాలని సూచించారు. అలాగే రసాయన ఎరువుల ధరలు, రాయితీలను హేతుబద్ధీకరించాలని కేంద్రాన్ని కోరారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కరువు పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచేందుకు కేంద్రం నుంచి సమగ్ర సహాయక చర్యలు అవసరమని మంత్రి స్పష్టం చేశారు.