జవహర్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్సు కింద నలిగి డెలివరీ బాయ్ దుర్మరణం!
జవహర్ నగర్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్‌నగర్ అంబేడ్కర్ నగర్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Horrific road accident) ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జియోమార్ట్ డెలివరీ బాయ్‌గా(JioMart Delivery boy) పనిచేస్తున్న యువకుడిని ఆర్టీసీ బస్సు(RTC bus) రూపంలో మృత్యువు కబళించింది.
జవహర్ నగర్ ఎస్ హెచ్ ఓ సైదులు,వెల్లడించిన వివరాల ప్రకారం జవహర్‌నగర్ అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన గంధమల్ల స్వామి (32) జియోమార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం స్వామి తన యాక్టివా 6జి స్కూటర్‌పై (చస్సిస్ No. ఎం ఈ 4జేకె 361ఏం ఎస్ జి 236520) అంబేడ్కర్ నగర్ సమీపంలోని రోజ్ గార్డెన్ వద్ద డెలివరీ పూర్తి చేసుకుని దమ్మాయిగూడ వైపు బయలుదేరాడు.
అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు (నెం. టీ ఎస్ 08జెడ్ 0171) డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా, అతివేగంగా బస్సును నడుపుతూ ఓవర్టేక్ చేసే క్రమంలో స్వామి వెళ్తున్న స్కూటీ కుడి వైపున బస్సుతో ఢీకొట్టాడు. దీంతో స్వామి కిందపడిపోగా, బస్సు వెనుక చక్రం ఆయన తలపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల కేసు నమోదు:
మృతుని తల్లి గంధమల్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తూ, భారతీయ న్యాయ సంహిత (బీ ఎన్ ఎస్ ) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ. దర్యాప్తు అధికారి శ్రీ ఆర్. రామకృష్ణ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీఆర్ . నెం : 1458/2026 గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో అంబేద్కర్ నగర్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.