నూడుల్స్ తిని ఐదుగురు మృతి.. గ్రామంలో విషాదం
ఐదుగురి మృతితో గ్రామంలో విషాదం.. రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్
గ్రేటర్ నోయిడా: రాత్రి భోజనం చేసి నిద్రపోయిన కుటుంబంలో తెల్లారేసరికి తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఉన్న రబూపురా ప్రాంతంలోని నగ్లా శ్రీ పదమ్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. మృతుల్లో దంపతులతో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన అక్టోబర్ 17, శనివారం ఉదయం వెలుగులోకి రావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్ (37), ఆయన భార్య లలిత (35), కుమార్తె మిష్టి (7), కుమారులు లడ్డూ (11), సాక్షత్ (3) మృతిచెందారు. కుటుంబ సభ్యులు ముందు రోజు రాత్రి నూడుల్స్ తిన్నారని స్థానికులు, మహేశ్ తల్లి చెప్పినట్లు సమాచారం. దీంతో Food Poisoning Case అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, ఆహారంలో ఏదైనా విషపదార్థం కలిసిందా? లేక మరేదైనా కారణమా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. Forensic Team ఆధారాలు సేకరిస్తుండగా, Food Safety Department అధికారులు ఆహార నమూనాలను పరిశీలించేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి, చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదికలు, ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాల తర్వాతే మరణాలకు అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనపై జేవర్ బీజేపీ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్ స్పందించారు. ఘటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేసినట్లు చెప్పారు. కుటుంబం తిన్న ఆహారంలో విషపదార్థాలు ఉన్నాయా? మరణాలకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ జరగాలని పేర్కొన్నారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, అన్ని అంశాలనూ నిష్పక్షపాతంగా పరిశీలించి నిజానిజాలను త్వరగా వెల్లడించాలని అధికారులను కోరారు. ప్రస్తుతం Greater Noida Family Deaths కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరణాలకు సంబంధించి అధికారికంగా తుది నిర్ధారణ వెలువడాల్సి ఉంది.