పోస్ట్‌మార్టం కోసం పైసల్.. విచారణకు ఆదేశం
బోధన్,(విజయ క్రాంతి): బోధన్ జిల్లా ఆసుపత్రి(bodhan district hospital)లో పోస్ట్‌మార్టం నిర్వహణకు సంబంధించి మృతుడి సహాయకుడి నుంచి రూ.1,000 డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్(Hospital Medical Superintendent) డాక్టర్ బి. రాహుల్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు సెప్టెంబర్ 24న మెస్సర్స్ స్పార్క్స్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్, హైదరాబాద్ యాజమాన్యానికి అధికారికంగా లేఖ జారీ చేశారు. సెప్టెంబర్ 21న ప్రజావాణి కార్యక్రమంలో బోధన్ డివిజన్ ఆర్డీఓకు ఫిర్యాదు అందినట్లు లేఖలో పేర్కొన్నారు.
రోగి సంరక్షణ సిబ్బందిగా పనిచేస్తున్న శ్రీ సద్దాం హుస్సేన్ పోస్ట్‌మార్టం(Postmortem) విషయంలో మృతుడి సహాయకుడిని రూ.1,000 డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. అదే మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, చెల్లింపునకు సంబంధించిన పత్రరూప, ఎలక్ట్రానిక్ ఆధారాలను ఫిర్యాదుతో పాటు సమర్పించినట్లు ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సెప్టెంబర్ 24న ఆంధ్రప్రభతో పాటు ఇతర పత్రికల్లో వార్తలు ప్రచురితమైన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, డబ్బులు ఏ పరిస్థితుల్లో డిమాండ్ చేసి స్వీకరించారో నిర్ధారించాలని సెక్యూరిటీ సంస్థను ఆదేశించారు. సంబంధిత సిబ్బందితో పాటు ఘటనలో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను విచారించి, నిజానిజాలను తేల్చాలని సూచించారు. ఆరోపణలు రుజువైతే నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు, చేపట్టిన చర్యలపై అనుపాలన నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఈ విషయంపై సమాచారం కోసం నిజామాబాద్ జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు కూడా లేఖ ప్రతిని పంపినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. రాహుల్ కుమార్ తెలిపారు.