ఖరీఫ్ పంటల కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
నిర్మల్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఖరీఫ్(వానాకాలం) పంటల కొనుగోలుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వెంకట మాధవ రావు(Additional Collector Venkata Madhava Rao) అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఖరీఫ్ పంటల కొనుగోలుపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటల కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు, లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పంటల సేకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా, నిర్ణీత గడువులోగా కొనుగోళ్లు పూర్తయ్యేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, డీఆర్డీఓ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.