గణేష్ ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

13-09-2026 | 05:30am
  1. ప్రశాంత వాతావరణమే లక్ష్యం 
  2. మండపాలకు ఉచిత విద్యుత్ 
  3. నిమజ్జనానికి ప్రత్యేక చర్యలు
  4. కంట్రోల్ రూంతో నిఘా.. అధికారుల నిరంతర పర్యవేక్షణ 
  5. సీఎం రేవంత్‌రెడ్డి.. గణేష్ ఉత్సవాలపై సమీక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : గణేశ్ ఉత్సవాలను ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) స్పష్టం చేశారు. ఉత్సవాల నిర్వహణ, బందోబస్తు, మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో శనివారం శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులు, నిర్వాహకులతో నేరుగా సమీక్షించే సంప్రదాయాన్ని పునర్దుద్ధరించామని, స్వయంగా సమస్యలు తెలుసుకునేందుకే సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం తెలిపారు. నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద ముందస్తుగా దరఖాస్తు చేసుకుని ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

మండపాల ఏర్పాటు సమాచారాన్ని స్థానిక కమిషనరేట్లకు అందించాలని, దీనివల్ల పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా, ఎలాంటి పరిణామాలు ఎదురైనా తక్షణ చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మ ఉత్సవాలకు కల్పించినట్లే.. గణేశ్ నిమజ్జనాలకు కూడా నిర్మాణ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నిమజ్జనం కోసం చెరువుల చుట్టూ క్రేన్ల ఏర్పాటుకు వీలుగా చర్యలు ఉండాలన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు మున్సిపల్, పోలీస్ శాఖల నిరంతర పర్యవేక్షణ ఉండాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.

హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు, మండప నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీ గణేష్, కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు