సభలో నెమ్మదిగా మాట్లాడాలి

13-09-2026 | 05:10am
  1. దాసోజు శ్రవణ్‌పై మండలి చైర్మన్ గుత్తా ఆగ్రహం
  2. నేనేమీ స్టూడెంట్‌ను కాదన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): చట్టసభలో నెమ్మదిగా మాట్లాడాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌(BRS MLC Dasoju Sravan)కు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) సూచించారు. శనివారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో జానపద కళాకారుల(Folk artists)పై ఎమ్మెల్సీ దాసోజు మాట్లాడుతున్న సమయంలో మంత్రి సీతక్క(Seethakka) కల్పించుకుని కామెంట్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ దాసోజు ఆగ్రహంతో ఊగిపోయారు. సభలో బిగ్గరగా ప్రతి విమర్శ చేశారు. దీంతో చైర్మన్ గుత్తా కల్పించుకుని.. ‘ఇది సభ.. డోంట్ స్పీక్ లౌడ్‌లీ.. మీ అభిప్రాయం చెప్పండి. స్లో వాయిస్‌లో మాట్లాడాలి’ అని సూచించారు.

ప్రతిగా ‘పేద వాళ్ల గురించి మాట్లాడుతున్నాను’ అని దాసోజు, అందుకు స్పందనగా ‘మీరు రిచెస్ట్ పర్సన్’ అంటూ చైర్మన్ మధ్య వ్యాఖ్యానం సాగింది. ఇంతలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘కొట్లాడుకునే హౌజ్ కాదిది, సభను సజావుగా సాగనివ్వాలి’ అని దాసోజును ఉద్దేశించి అన్నారు. వెంటనే దాసోజు మైకు అందుకున్నారు. ‘నేను కిడ్‌ను కాదు.. స్టూడెంట్‌ను కాదు.. మీరు హెడ్‌మాస్టర్ కాదు’ అని చైర్మన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకు గుత్తా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే సభలో నెమ్మదిగా మాట్లాడాలని సూచిస్తూ దాసోజు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు.

మరిన్ని వార్తలు