4 September, 2026 | 7:53 PM

శిరీష హత్య.. నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

04-09-2026 | 06:35pm

 ములకలపల్లి మండలంలో మృతురాలు  తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొంగులేటి

 రాష్ట్ర ప్రభుత్వం తరఫున  ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్స్, ఐదు లక్షల చెక్కు అందజేత

ములకలపల్లి,(విజయక్రాంతి): నిరుపేద గిరిజన కుటుంబ నేపథ్యం నుంచి హైదరాబాద్ లో స్టాఫ్ నర్స్ గా పనిచేసేందుకు ములకలపల్లి మండలం నుంచి వెళ్లిన ఊకే శిరీషను హత్య చేసి, అనంతరం లైంగిక దాడి(Sexual assault) చేసిన మానవ మృగానికి చట్ట ప్రకారం కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం ములకలపల్లి మండలంలోని మృతురాలి స్వగ్రామం చౌటిగూడెం గ్రామానికి వెళ్లి తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి సవ్యసమాజం తలదించుకునేలా శిరీష హత్య జరగడం దారుణమని మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు.

మానవ మృగం చేతిలో గిరిజన యువతి శిరీష హత్య కావడం దారుణమైన సంఘటనని అన్నారు. భద్రాచలం ఐటిడిఏ పరిధిలో గతంలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొని  ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా ఉపాధి పొంది కుటుంబానికి అండగా నిలిచేందుకు హైదరాబాద్ వెళ్లిన శిరీష,ఆమె మృతి ఆ కుటుంబానికి తీరనిలోటని తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతురాలి తల్లి, అన్న, వదిన, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తీరని నష్టం కుటుంబానికి జరిగిందని, సవ్యసమాజం తలదించుకునేలా శిరీష హత్య జరిగిందని, నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పక న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున  మీ కుటుంబానికి అండగా ఉంటానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున  ఇందిరమ్మ ఇల్లు(Indiramma house) ప్రొసీడింగ్స్, రు.5 లక్షల చెక్కును  జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah), స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన,ఐటీడీఏ పీ.వో రాహుల్, హౌసింగ్ పీ.డీ సవయ్ రామ్ లతో సమక్షంలో మృతురాలి కుటుంబ సభ్యులను అందజేసి పరామర్శించారు. అనంతరం హైదరాబాదులో శిరీష హత్య జరిగిన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీ.పీ తో మృతురాలి ఇంట్లో నుంచి కుటుంబ సభ్యుల ముందు ఫోన్ లో మంత్రి పొంగులేటి మాట్లాడారు. నర్సింగ్ విద్యార్థి శిరీష(Nursing student Sirisha) హత్య జరిగిన వసతి గృహాన్ని తక్షణమే తనిఖీలు చేపట్టి ఆసుపత్రికి అనుసంధానమైన వసతి గృహంలో రక్షణ చర్యలు పై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

అవసరమైతే ఆ ఆసుపత్రిని సీజ్ చేసేలా చర్యలు చేపడతామని, హత్యకు కారకుడైన నిందితుడిపై ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్ లో ఆసుపత్రి, వసతి గృహాల సంబంధించిన వారిని ఎందుకు చేర్చలేదని అడిషనల్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం అయ్యి శిరీష కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి విలేఖరులతో అన్నారు. మృతురాలి తల్లి ఆవేదనకు, ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయానని, ఆ తల్లి మనోవేదనకు నా మనసు కలత చెందిందని మంత్రి పొంగులేటి అన్నారు.  మంత్రి పొంగులేటి వెంట కొత్తగూడెం ఆర్డీవో మధు, ములకలపల్లి తాహాసిల్దార్ స్వాతి, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.