పెళ్లి కోసం తొందరేమీ లేదు
ప్రముఖ నటి నిత్యా మేనన్(Actress Nithya Menen) తన పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వివాహానికి తాను వ్యతిరేకం కాదని, అయితే పెళ్లి చేసుకోవాలనే తొందర కూడా లేదని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వాన్ని, స్వేచ్ఛను గౌరవించే సరైన వ్యక్తి జీవితంలోకి వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపారు.
తాజాగా ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడిన నిత్యా.. జీవితంలో స్వతంత్రంగా ఉండటం తనకు ఎంతో ముఖ్యమని చెప్పారు. కేవలం సమాజం కోసం లేదా వయసు వచ్చిందనే కారణంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని అనుకోవడం లేదన్నారు. తన ఎదుగుదలకు తోడ్పడుతూ, పరస్పర గౌరవంతో మెలిగే భాగస్వామి కావాలని అభిప్రాయపడ్డారు. అహంకారం, ఆంక్షలతో కూడిన బంధాలు ఆరోగ్యకరమైనవి కావని పేర్కొన్నారు. ఇప్పటివరకు తన ఆలోచనలు, జీవన విధానానికి సరిపోయే వ్యక్తి ఎదురుకాలేదని వెల్లడించారు.
అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలోనూ ఎంతోమంది సంతోషంగా ఉంటున్నారని, ప్రేమించి పెళ్లి చేసుకున్నవారిలోనూ విడాకులు తీసుకునే పరిస్థితులు వస్తుంటాయని అన్నారు. ఏ వివాహ విధానం సరైనదో, ఏది తప్పో నిర్ణయించలేమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి పెళ్లి కంటే జీవితంలో ప్రశాంతత, స్వేచ్ఛ, పరస్పర అవగాహనతో కూడిన బంధానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని నిత్యా మేనన్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.