కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం

19-09-2026 | 10:12pm

బాధితులకు సకాలంలో న్యాయం అందించాలి. 

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): కేసుల సత్వర పరిష్కారం, బాధితులకు వేగంగా న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్, జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్(SP Sangram Singh G. Patil) అన్నారు. జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ అధ్యక్షతన కోర్ట్ కోఆర్డినేషన్(Court Coordination) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై సమీక్షించారు. ఫోక్సో మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు(Cybercrimes), తీవ్రమైన కేసుల్లో శాస్త్రీయ, ఫోరెన్సిక్ ఆధారాలతో నిర్ణీత గడువులో ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు.

నిందితులకు శిక్ష పడేలా పీపీలు, కోర్టు లైజన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా కృషి చేయాలని, నాన్‌-బెయిలబుల్ వారెంట్లను వేగంగా అమలు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచాలని ఎస్పీ ఆదేశించారు. జాతీయ లోక్‌అదాలత్ విజయవంతానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కోర్టు డ్యూటీ సిబ్బంది, పీపీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు