అక్రమ క్రషర్, మైనింగ్ రద్దు చేయాలి

19-09-2026 | 10:34pm

ఆమనగల్లు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆకుతోటపల్లి ప్రజల మహాధర్నా

​ఆమనగల్లు,(విజయక్రాంతి): ఆమనగల్లు మండలం(Amanagal Mandal) ఆకుతోటపల్లి గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్, క్రషర్ కార్యకలాపాలను(crusher and mining operations) వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, ప్రజా సంఘాల ప్రతినిధులు శనివారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ​అంతకుముందు గ్రామాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో స్థానిక బస్టాండ్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు.

గ్రామ సమీపంలో సాగుతున్న మైనింగ్, క్రషర్ వల్ల పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని, ప్రజల ఆరోగ్యం మరియు జీవన పరిస్థితులపై ఇది దుష్ప్రభావాన్ని చూపుతోందని నిరసనకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా, అనుమతులకు విరుద్ధంగా నడుస్తున్న ఈ అక్రమ యూనిట్లపై అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. క్రషర్ ద్వారా ఉత్పన్నమయ్యే విపరీతమైన దుమ్ము, శబ్ద కాలుష్యం వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు వాపోయారు.

అలాగే రోజూ భారీ వాహనాల రాకపోకల వల్ల రహదారులు ధ్వంసమై ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.గ్రామస్తుల అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సంబంధిత శాఖల అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ పోరాటానికి గ్రామస్తులు, యువత, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై తమ నిరసనను తెలియజేసి మద్దతు ప్రకటించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు