నగరంలో వర్షం.. GHMC, హైడ్రా అలర్ట్

19-09-2026 | 06:04pm

హైదరాబాద్, సెప్టెంబర్ 19,(విజయక్రాంతి): హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం(Heavy rain) ముంచెత్తింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, టోలిచౌకి, షేక్‌పేట్, ఓయూ కాలనీ, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, నల్లకుంట, విద్యానగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, తార్నాక, సికింద్రాబాద్‌తో పాటు ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం(Heavy rain) కురిసింది.

భారీ వర్షానికి పలు రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం ఆఫీసులు, విద్యాసంస్థలు ముగిసే సమయంలో వర్షం కురవడంతో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలుచోట్ల వాహనాల రాకపోకలు నెమ్మదించాయి.

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు. మరికొన్ని గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రావద్దని, అవసరమైతే అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

మరిన్ని వార్తలు