కరువుపై శాఖల వారీగా సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలి

30-10-2026 | 03:37pm

తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): జిల్లాలోని 13 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం(State Government) కరువు మండలాలుగా గుర్తించిన నేపథ్యంలో కరువు పరిస్థితులపై శాఖల వారీగా సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్(Collector Hemant Keshav Patil) అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు బి.చెన్నయ్య, దేవసహాయంతో కలిసి వివిధ శాఖల అధికారులతో కరువు పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఉర్కొండ, వెల్దండ, కల్వకుర్తి, వంగూరు, చారకొండ, అమ్రాబాద్, పదరా, అచ్చంపేట, బల్మూరు, లింగాల, పెద్దకొత్తపల్లి, కోడేరు, బిజినేపల్లి మండలాలను కరువు మండలాలుగా గుర్తించినట్లు తెలిపారు.

గ్రామాల్లో బోర్లు, చేతిపంపులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైపులైన్ల పరిస్థితిని పరిశీలించి ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి సరఫరాను పర్యవేక్షించాలని ఆదేశించారు. నీటి సమస్య ఉన్న గ్రామాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.

వ్యవసాయ, ఉద్యాన శాఖలు పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు అవసరమైన సూచనలు అందించాలని, అన్ని శాఖలు క్షేత్రస్థాయి వివరాలు, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్వో పాండు, ఆర్డీవోలు అర్చన, బన్సీలాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు