జిల్లా విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ
- 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులతో ముఖాముఖి
- 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రోత్సాహం
కన్నాయిగూడెం, నవంబర్ 27(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి కేజీబీవీ పాఠశాల(Muppanapalle KGBV School), హాస్టల్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి శుక్రవారం రోజున ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, పాఠశాల ఆవరణను పరిశీలించి విద్యా బోధన, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై పర్యవేక్షణ చేశారు.
అనంతరం 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. విద్యార్థుల చదువు, పరీక్షల సన్నద్ధత గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులు కష్టపడి చదివి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.
విద్యార్థులందరూ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం కేజీబీవీ ప్రత్యేక అధికారి అశ్విని మరియు టీచర్స్ పాల్గొన్నారు.