క్రీడలకు తెలంగాణ పెద్దపీట: పొన్నం

27-11-2026 | 05:40pm

హైదరాబాద్: తెలంగాణను దేశంలోనే ప్రముఖ క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. డిసెంబర్ 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన ఖేలో ఇండియా క్రీడా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

తుర్కపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల(Mahatma Jyotiba Phule BC Residential Educational Institutions) ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను మంత్రి ప్రారంభించారు. ఒలింపిక్ జ్యోతిని వెలిగించి క్రీడాకారులకు అందించారు. అనంతరం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Chamakura Malla Reddy)తో కలిసి వాలీబాల్ ఆడి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు.

విద్యతోపాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ(Young India Sports University) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

దక్షిణ కొరియా వంటి దేశాలు క్రీడల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నాయని, భారత క్రీడాకారులు కూడా ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని పొన్నం తెలిపారు. గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు డైట్ ఛార్జీలను 40 శాతం పెంచినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గురుకులాల కార్యదర్శి సైదులు, జిల్లా కలెక్టర్ మను చౌదరి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు