విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్.. సింగరేణి భారీ సాయం

27-11-2026 | 05:19pm

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల(Government School Students)కు పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బ్రేక్‌ఫాస్ట్ పథకానికి(Breakfast Scheme) సింగరేణి సంస్థ భారీ ఆర్థిక చేయూత అందిస్తోంది. తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల నుంచి ఏకంగా రూ.61.44 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది అత్యాధునిక కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేస్తోంది.

హరేకృష్ణ ఫౌండేషన్ నిర్వహణలో కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా 4 లక్షలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రతిరోజూ ఉచితంగా పౌష్టిక అల్పాహారం అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) మార్గదర్శకత్వంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తొమ్మిది ప్రాంతాల్లో మెగా కిచెన్లు

మొదటి విడతలో కొడంగల్‌లో వంటశాల నిర్మాణానికి సింగరేణి రూ.2 కోట్లు అందించింది. అనంతరం మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లో వంటశాలల ఏర్పాటుకు మరో రూ.21.03 కోట్లు కేటాయించింది.

తదుపరి సింగరేణి, కొత్తగూడెం, భూపాలపల్లి, కాగజ్‌నగర్, మునగాల ప్రాంతాల్లో నిర్మించనున్న వంటశాలల కోసం రూ.38.41 కోట్లు కేటాయించింది. ఈ తొమ్మిది కేంద్రాల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించనున్నారు.

ఆకలి లేని చదువే లక్ష్యం

ఆధునిక యంత్రాలు, పరిశుభ్రమైన వంట వాతావరణంతో ఈ కేంద్రాల్లో ఆహారం తయారు చేసి పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. విద్యార్థులకు ఉదయమే పౌష్టికాహారం అందడం వల్ల చదువుపై ఏకాగ్రత పెరగడంతో పాటు పాఠశాలలకు హాజరు మెరుగుపడుతుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దేశానికి ఇంధన వెలుగులు అందించే సింగరేణి.. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుకు కూడా అండగా నిలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆకలి తీర్చడంతో పాటు విద్యాభివృద్ధికి తోడ్పడే ఈ కార్యక్రమం సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తోంది.

మరిన్ని వార్తలు