తెలంగాణ భవన్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం
ఖమ్మం, నవంబర్ 27(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా(Khammam District) బీఆర్ఎస్ పార్టీ(BRS) కార్యాలయం 'సీఎంఆర్ఎఫ్ చెక్కులను(CMRF Cheque) రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర(Vaddiraju Ravichandra), బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ: "ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల ఆరోగ్య అవసరాలను గుర్తించి, ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో సీఎంఆర్ఎఫ్ నిధులను అందజేశారు.
కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుపై పరిమితులు విధించి, రూ. 60 వేలకు మించి రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకుండా పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్న బాధితులకు కేవలం రూ. 1,000, రూ. 2,000 చెక్కులు ఇవ్వడం బాధాకరం. సంక్షేమ పథకాల అమలులో, పేదల కష్టాలు తీర్చడంలో కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలందరూ భావిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణు గోపాల్, పగడాల నాగరాజు, భాషబోయిన వీరన్న, వేముల వీరయ్య, నాయకులు ముత్యాల వెంకటప్పారావు పాల్గొన్నారు.