ప్రోటోకాల్ రగడ.. సీఎస్, డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

27-11-2026 | 05:52pm

హైదరాబాద్: తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రోటోకాల్ వివాదం(Protocol Violation) మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(MLA Devireddy Sudheer Reddy) ఆరోపించారు.

సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన.. నియోజకవర్గాల్లో జరిగే చెక్కుల పంపిణీ, అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతలే ముందుండి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు దక్కాల్సిన ప్రాధాన్యతను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

ప్రోటోకాల్ ఉల్లంఘనలపై మూడేళ్లుగా ఓపిక పట్టామని, అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని సుధీర్ రెడ్డి అన్నారు. ఉల్లంఘనలు మరింత పెరగడంతో ఇక మౌనంగా ఉండలేక సంబంధిత అధికారులను ఆశ్రయించినట్లు వెల్లడించారు.

ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు రాజకీయ పార్టీల కార్యక్రమాలుగా మారకూడదని, నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులకు గౌరవం కల్పించాలని కోరారు. ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.


మరిన్ని వార్తలు