పీహెచ్‌సీ ఎదిరలో ఐటీడీఏ పీఓ ఆకస్మిక తనిఖీ

18-09-2026 | 09:12pm

వైద్య సేవలు, మందుల లభ్యతపై సమీక్ష,.. రోగులతో నేరుగా ఆరా.

వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను పరిశీలించేందుకు ఐటీడీఏ ఎటూరునాగారం ప్రాజెక్టు అధికారి (పీఓ) శుక్రవారం వెంకటాపురం మండలం ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(Primary Health Center) సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించిన పీఓ.. మందుల నిల్వలు, మందుల లభ్యత, ప్రసవాల వివరాలు, ల్యాబొరేటరీ సేవలు, రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్వహణపై వైద్యాధికారి డాక్టర్ ఆశిష్‌ను సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయి.

సిబ్బంది స్పందన ఎలా ఉంది, అవసరమైన మందులు అందుతున్నాయా అనే అంశాలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు, తగిన సంరక్షణ అందేలా వైద్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకెళ్లడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాత్ర కీలకమని, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో వైద్యం, అవసరమైన మందులు, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని పీఓ సూచించారు. ఈ తనిఖీలో వైద్యాధికారి డాక్టర్ ఆశిష్, నర్సింగ్ ఆఫీసర్లు కవిత, సాయి లక్ష్మి, ఫార్మసిస్ట్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు