మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు కొత్త యూనిఫాంలు

18-09-2026 | 10:20pm

నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మండలంలోని గోపాల్‌పేట్‌ తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు ప్రభుత్వం సమకూర్చిన నూతన యూనిఫాంలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట్‌రెడ్డి(MEO Venkat Reddy) మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని గోపాల్పేట్ గ్రామ సర్పంచ్‌ వంశీకృష్ణగౌడ్‌ తెలిపారు. పాఠశాల ఆవరణలోని చెట్ల కొమ్మలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హాస్టల్‌ విద్యార్థులకు సామగ్రి

బాలికల హాస్టల్‌ విద్యార్థులకు కాలేజ్‌ బ్యాగులు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్టీల్‌ ప్లేట్‌, గ్లాస్‌, మగ్‌, గిన్నె, చెంచా తదితర వస్తువులను పంపిణీ చేశారు. మోడల్‌ స్కూల్స్‌ ప్రారంభమైన 14 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది పాఠశాలలో 780 మంది విద్యార్థులు చేరారని ప్రిన్సిపాల్‌ రాంప్రసాద్‌ తెలిపారు. తల్లిదండ్రులు, దాతలు, అధికారులు అందిస్తున్న సహకారంతో పాఠశాల అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు