బచ్చన్నపేటలో వనజీవి

19-10-2026 | 05:15am

బచ్చన్నపేట, (విజయక్రాంతి): ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య జీవిత కథ ఆధారంగా ‘వనజీవి’(Vanajeevi Film) అనే ప్రతిష్ఠాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వాస్విక్ ఎంటర్‌టైన్‌మెంట్స్(Production company Vaswik Entertainments)  పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త, సమాజ సేవకుడు నిడిగొండ నరేశ్ ప్రజాపతి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డు గ్రహీత, సున్నితమైన కథలకు కేరాఫ్‌గా నిలిచే దర్శకుడు వేముగంటి తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ వనజీవి రామయ్య పాత్రలో కనిపించనున్నారు. బ్రహ్మాజీ కెరీర్‌లోనే ఇదొక విభిన్న, సవాలుతో కూడిన పాత్ర కానుంది. రామయ్య సతీమణి పాత్రను నాగరాణి రెడ్డి పోషిస్తున్నారు. ప్రస్తుతం బచ్చన్నపేట పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రానికి డీవోపీ: తోట వీ రమణ; సంగీతం: బల్లెపల్లి మోహన్; ఆర్ట్: కోడూరి కార్తీక్; ఎడిటర్: మాలిక్; లైన్ ప్రొడ్యూసర్ : నవీన్. 

ఎవరీ వనజీవి రామయ్య? 

ఖమ్మం జిల్లాకు చెందిన దరిపల్లి రామయ్య అలియాస్ వనజీవి రామయ్య గురించి తెలియని వారుండరు. నిరక్షరాస్యుడైనప్పటికీ, ప్రకృతిపై అపారమైన ప్రేమతో తన జీవిత కాలంలో కోటికి పైగా మొక్కలు నాటి, వాటిని సొంత బిడ్డల్లా పెంచి, ఖమ్మం పరిసరాలను పచ్చదనంతో నింపిన మహోన్నత వ్యక్తి. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

సినిమా లక్ష్యం ఇదే కేవలం వినోదం కోసం కాకుండా, నేటి యువతలో పర్యావరణ స్పృహ కల్పించడం, చెట్లను నరకడం వల్ల జరుగుతున్న అనర్థాలను తెలియజెప్పడం, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలనే సందేశాన్ని ఇవ్వడం ఈ చిత్ర ప్రధాన ఉద్దేశమని చిత్ర బృందం తెలిపింది. మొక్కలే ప్రాణంగా బతికిన ఆ మహనీయుడి జీవితంలోని కష్టాలు, అవమానాలు, ఆయన పట్టుదలను వెండితెరపై ఆవిష్కరించనున్నారు.

ఈ చిత్రాన్ని జాతీయ, అంతర్జాతీయ అవార్డుల స్థాయికి తీసుకెళ్లాలనే ఆశయంతో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు నిర్మాత నిడిగొండ నరేశ్ ప్రజాపతి తెలిపారు. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేసి, షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు వేముగంటి వెల్లడించారు. 

మరిన్ని వార్తలు