పండుగలొస్తే.. ఆర్టీసీ బాదుడేంది?

19-10-2026 | 05:20am
  1. మహిళలకు ఫ్రీ జర్నీ అంటూ.. పురుషులకు డబుల్ ఛార్జీలా?
  2. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు రూ. నాలుగు వందలా?
  3. హరీశ్ రావు మండిపాటు

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): పండుగలు వస్తే చాలు.. ఇష్టము న్నట్లు ఆర్టీసీ ఛార్జీలతో బాదుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి హరీశ్‌రావు((Former minister Harish Rao)) మండిపడ్డారు. ‘బతుకమ్మ, దసరా పండుగల వేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను డబుల్ చేసి నిలువుదోపిడీ చేయడం ఏమిటి రేవంత్‌రెడ్డీ? ఇది సిగ్గుచేటు’ అని ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా విమర్శించారు.

రెగ్యులర్ బస్సులు తగ్గించి,స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ‘జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు రూ. 230 ఉండే టికెట్‌ను ఏకంగా రూ.400కు పెంచారు. మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు మొన్నటివరకు రూ.220 ఉండగా.. ఇప్పుడు రూ.290 పైగా వసూలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ ఛార్జీలు డబుల్ చేసి, ప్రజల జేబులు గుల్ల చేసి, పండుగ సంబురం లేకుండా చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెటా?

ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్‌గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి అధిక ఛార్జీలతో దోపిడీ చేస్తున్నారని, ఇది ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుందని హరీశ్ రావు విమర్శించారు. ‘మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి.. పురుషుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారా? భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్ వసూలు చేస్తే, మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా?’ అని ప్రశ్నించారు.

‘ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన?’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆయన నిలదీశారు. ఇప్పటికే మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలను 5 సార్లు పెంచారని, ఇప్పుడు పండుగల పేరుతో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు.

‘రేవంత్ ప్రభుత్వ తీరుతో పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడే దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి.. పండుగల పేరుతో పెంచిన అడ్డగోలు ఛార్జీలను తగ్గించాలి. రెగ్యులర్ బస్సులను యథావిధిగా నడిపి.. పేద, మధ్యతరగ  ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.  

 

మరిన్ని వార్తలు