త్వరలో గార్మెంట్ ఫ్యాక్టరీ ప్రారంభం
- 400 మందికి ఉపాధి అవకాశాలు
- కుట్టు శిక్షణతో మహిళల స్వయం ఉపాధికి బాటలు
- అంగన్వాడీ, వీవో భవనాలకు రూ.14.76 కోట్లు
- భూపాలపల్లి నియోజకవర్గానికి రూ.12.58 కోట్లు మంజూరు
- నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలి
- మంథనిలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మంథని ప్రాంతంలో మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించడమే లక్ష్యంగా త్వ రలోనే గార్మెంట్ ఫ్యాక్టరీని(Garment Factory) ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 300 నుంచి 400 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. మహిళ లు కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాల ని, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
ఆదివారం మంథని పట్టణంలో ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని 302 మంది లబ్ధిదారులకు సుమారు కోటి రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అలీఫ్, డీఆర్డీఏ, మెప్మా, సీఎస్ఆర్ సంస్థల సహకారంతో కుట్టు శిక్షణ పూర్తి చేసిన 600 మందికి ధ్రువపత్రాలను అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 3,040 మందికి ఉచిత కుట్టు శిక్షణ అందించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
మహిళా సాధికారతకు ప్రాధాన్యం..
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాల నే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి తెలిపారు. మంథని పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో మహిళా ఇం దిరా శక్తి పథకం కింద మంజూరైన నూతన నూనె గానుగ మిల్లును ప్రారంభించారు. మ హిళలు కుట్టు శిక్షణతో పాటు పాడి పరిశ్రమ వంటి స్వయం ఉపాధి రంగాలపై దృష్టి సారించాలని సూచించారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ మంథని నియోజకవర్గంలో అంగన్వాడీ, గ్రామైక్య సంఘాల భవనాల నిర్మాణానికి రూ.14.76 కోట్లు, భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో రూ.12.58 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
విద్య, వైద్యానికి మౌలిక సదుపాయాలు..
ప్రజా ప్రభుత్వం విద్య, వైద్య రంగాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడాలి..
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నీరు, వి ద్యుత్ వంటి వనరులను ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించాలని మంత్రి సూచించా రు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరుల సంరక్షణకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రజలతో పాటు మంథని ప్రా ంత ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మున్సిపల్ చైర్మన్ వడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచే, ఆర్టీఏ సభ్యుడు మంథని సురేష్, కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మాజీ ఎంపీపీ కొండా శంకర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.