సీఎం రేవంత్ సీరియస్
MVSR కాలేజీ ఘటనపై సీఎం ఆరా
నాదర్గుల్: రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని MVSR ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన దాండియా వేడుకలు(Dandiya Event) విషాదాంతమయ్యాయి. కార్యక్రమం సందర్భంగా లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన భారీ లోహపు స్టాండ్ కూలిపోవడంతో ఓ విద్యార్థిని మృతి చెందగా, మరో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు.
రెండు రోజుల పాటు నిర్వహించిన ‘సంగమం’ వార్షిక సాంకేతిక, సాంస్కృతిక ఉత్సవాల ముగింపు వేళ ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. బలమైన గాలుల కారణంగా లైటింగ్ నిర్మాణం కూలినట్లు ప్రాథమిక సమాచారం. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
విద్యార్థిని మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
కాలేజీలో పోలీసుల మోహరింపు
ప్రమాదం నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనల మధ్య కళాశాల ప్రాంగణంలో పోలీసులు మోహరించారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వేడుకల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించలేదని మృతురాలి బంధువు ఆరోపించారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లపై అధికారుల విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.