ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్
టెలికాం వినియోగదారులకు ఉపయోగపడేలా భారతీ ఎయిర్టెల్(Bharti Airtel) కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ డేటా అవసరం లేని కస్టమర్ల కోసం ₹185, ₹203, ₹206 ధరలతో మూడు వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) అక్టోబర్ 21లోపు డేటా బండిల్ చేయని ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ టారిఫ్ ప్లాన్లను అందించాలని టెలికాం కంపెనీలను ఆదేశించిన నేపథ్యంలో ఎయిర్టెల్ ఈ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
ఈ మూడు రీఛార్జ్ ఆప్షన్లలోనూ అపరిమిత లోకల్, నేషనల్ వాయిస్ కాల్స్తో పాటు 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అయితే, ప్లాన్ల వ్యాలిడిటీలో తేడా ఉంది. ₹185 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉండగా, ₹203 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. ఇక ₹206 ప్లాన్ క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్లను ఎయిర్టెల్ యాప్లో ప్రీపెయిడ్ వినియోగదారులు పరిశీలించవచ్చు. సాధారణంగా టెలికాం కంపెనీలు అందించే రీఛార్జ్ ప్యాక్లలో వాయిస్ కాల్స్తో పాటు 4G లేదా 5G డేటా కూడా ఉంటుంది.
అయితే, ఇంట్లో వైఫై ఉపయోగించేవారు, ఫీచర్ ఫోన్లు వాడేవారు, మొబైల్ డేటా వినియోగం తక్కువగా ఉండేవారు తమకు అవసరం లేని డేటా కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటి వినియోగదారులకు వాయిస్ ఓన్లీ ప్లాన్లు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రత్యేక టారిఫ్ వోచర్లపై TRAI తీసుకున్న నిర్ణయం ప్రకారం, టెలికాం ఆపరేటర్లు డేటా లేకుండా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలను అందించే ప్లాన్లను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ కొత్త ప్లాన్లను ప్రకటించగా, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు కూడా నిబంధనలకు అనుగుణంగా తమ టారిఫ్ ఆప్షన్లను అందించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వినియోగదారుల ఆదరణను బట్టి మరిన్ని వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.