ఆలయాల అభివృద్ధికి 2,500 కోట్లు

19-10-2026 | 05:20am
  1. భద్రాచలానికి రూ.276 కోట్లు, బాసరకు రూ.354 కోట్లు
  2. రహదారుల నిర్మాణానికి రూ.90 వేల కోట్లు..
  3. వైరాలోని నాచారం ఆలయానికి రూ.44 కోట్లతో రోడ్డు
  4. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఖమ్మం, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధితోపాటు ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka ) అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి సుమారు రూ.2,500 కోట్లతో పనులు చేపడుతున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతాలు, అక్కడి ఆలయాల అభివృద్ధికి రూ.2,000 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.

భద్రాచలం దేవస్థానం అభివృద్ధికి రూ.276 కోట్లు, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి కి రూ.354 కోట్లు కేటాయించినట్లు వివరించారు. నాచారం ఆలయానికి రూ.44 కోట్లతో రహదారిని నిర్మిస్తామన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం ఏన్కూరు మండలం నాచారంలోని అద్భుత వెంకటేశ్వర స్వామిని ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దర్శించుకు న్నారు. ఈ సందర్భంగా ఈ ఆలయానికి వెళ్లే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయానికి భవిష్యత్తులో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రూ.44 కోట్లతో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే రామదాసు నాయక్ పట్టుదలతో ఈ రహదారికి నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

రహదారి నిర్మాణంతో భక్తులకు సౌకర్యం కలగడమే కాకుండా స్థానికంగా వ్యాపా రాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రజల కుటుంబ అవసరాలను తీర్చడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని ఉప ముఖ్య మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, వైరా నియోజకవర్గానికి కూడా ఈ పాఠశా లను మంజూరు చేసినట్లు తెలిపారు.

ఈ ప్రాంతానికి అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ కూడా కేటాయించామన్నారు. అన్ని వర్గాల విద్యార్థుల కు నాణ్యమైన విద్య అందించి, ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో రహదారుల అభివృ ద్ధికి సుమారు రూ.90 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ డిమాండ్ 20 వేల మెగావాట్లకు పైగా పెరిగినా నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని భట్టి విక్రమార్క హెచ్చరించారు. తాగునీటితోపాటు పశువులు, పక్షుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ప్రజలకు, రైతులకు సూచించారు. 

వైరాకు మరో బీటీ రోడ్డు హామీ

వైరా నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే పలు రహదారులను మంజూరు చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. నాచారం గ్రామం నుంచి జూలూరుపాడు మీదుగా తల్లాడభద్రాచలం ప్రధాన రహదారిని కలిపేలా గన్నవరం, నాచారం, భద్రతండా ప్రాంతాలకు ఉపయోగపడే మరో బీటీ రహదారిని మంజూరు చేస్తానని భట్టి హామీ ఇచ్చారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడం, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు