రిజాయిండర్‌లోనూ సందేహాలే!
- ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ ప్రకటనలో లోపాలపై ‘విజయక్రాంతి’ కథనం
- స్పందించిన డీఎంహెచ్‌ఓ
- రాత పరీక్ష లేదని రిజాయిండర్.. నోటిఫికేషన్‌లో 90 మార్కులు
- ఖాళీలు, రోస్టర్‌పై కరువైన స్పష్టత
- దరఖాస్తు గడువుపై అభ్యంతరాలు లోపాలపై సమీక్షకు అభ్యర్థుల డిమాండ్
మంచిర్యాల, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)(National Health Mission) నియామక నోటిఫికేషన్‌పై అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు లేకపోగా.. వైద్యారోగ్య శాఖ అధికారి(Medical and Health Department Official) (డీఎంహెచ్‌వో) స్పందనతో మరిన్ని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మంచిర్యాల జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయం విడుదల చేసిన 52 పోస్టుల నోటిఫికేషన్‌లో రాత పరీక్ష ప్రస్తావన, కేటరిగీల వారీ ఖాళీలు,
రిజర్వేషన్ రోస్టర్, దరఖాస్తు రుసుము, స్వల్ప వ్యవధిలో దరఖాస్తుల స్వీకరణ వంటి అంశాలపై ఈనెల 18న ‘ఎన్‌హెచ్‌ఎం నోటిఫికేషన్‌పై అనామానాలు’ శీర్షికతో విజయక్రాంతి ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనికి డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ స్పందిస్తూ రిజాయిండర్ విడుదల చేశారు. అయితే డీఎంహెచ్‌వో వివరణలోనూ నోటిఫికేషన్‌లోని కీలక అంశాలపై పూర్తిస్థాయి స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్‌ను రద్దు చేసి, సవరణలతో కొత్తగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రిజాయిండర్‌పై అభ్యంతరాలు
ఎన్‌హెచ్‌ఎం నియామకాల్లో రాత పరీక్ష నిర్వహించే విధానం లేదని డీఎంహెచ్‌వో రిజాయిండర్‌లో పేర్కొన్నారు. అయితే అధికారిక నోటిఫికేషన్‌లోని సెలక్షన్ క్రైటీరియాలో ‘మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ’కింద రాత పరీక్షకు 90 మార్కుటు కేటాయించినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. రాత పరీక్ష నిర్వహించకపోతే నోటిఫికేషన్‌లో మార్కుల ప్రస్తావన ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.
అధికారిక ప్రకటనలోనే రెండు భిన్నమైన సంకేతాలు కనిపిస్తున్నాయని, అసలు నియామక ప్రక్రియ ఏ పద్ధతిలో చేపడుతారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా పోస్టుల జాబితాలో లేని ఉద్యోగానికి సంబంధించి ఎంపిక ప్రమాణాల్లో ప్రస్తావన ఎందుకు వచ్చిందనే ప్రశ్నకు వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.
రిజర్వేషన్ నిబంధనలు, రోస్టర్ విధానం పాటిస్తామని అధికారులు రిజాయిండర్‌లో పేర్కొన్నప్పటికీ ఏ పోస్టుకు ఏ కేటగిరీ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్)కి ఎన్ని ఖాళీలు కేటాయించారనే వివరాలు మాత్రం వెల్లడించకపోడం గమనార్హం. ఇక నోటిఫికేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఫీజు మినహాయింపులపై స్పష్టమైన సమాచారం లేదని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
భిన్నమైన రూల్స్
ఇదే జిల్లాలో విడుదలైన ఆయుష్ నియామక నోటిఫికేషన్‌లో కేటగిరీల వారీగా ఖాళీలు పేర్కొన్నప్పుడు ఎన్‌హెచ్‌ఎం ప్రకటనలో అలాంటి వివరాలు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేటగిరీల వారీగా ఖాళీలపై స్పష్టత లేకుండా దరఖాస్తులు స్వీకరించడం వల్ల తమ వర్గానికి ఖాళీ ఉందో లేదో తెలియకుండానే అభ్యర్థులు రుసుము చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దరఖాస్తు గడువు మూడు రోజులే ఎలా?
దరఖాస్తుల స్వీకరణ గడువుపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 12న నోటిఫికేషన్ విడుదల కాగా.. మరుసటి రోజు 13 నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారని, గడువు తక్కువగా ఇవ్వడంతో సమయమంతా సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవడానికే సరిపోయిందని అభ్యర్థులు వాపోతున్నారు. కనీసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయంపై కూడా అధికారులు కచ్చితమైన అవగాహన లేదని ఆరోపిస్తున్నారు. గడువు మరో రెండు వారాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. లోపాలపై సమీక్ష నిర్వహించి, కారణాలపై వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.
కలెక్టర్ జోక్యం చేసుకోవాలి
ఎన్‌హెచ్‌ఎం నోటిఫికేషన్‌లో తలెత్తిన సందేహాలను జిల్లా కలెక్టర్ సమీక్షించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఎంపిక విధానం, రిజర్వేషన్ రోస్టర్, కేటగిరీల వారీ ఖాళీలు, ఫీజు మినహాయింపు, దరఖాస్తు గడువు పొడిగింపుపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని పేర్కొంటున్నారు.
అవసరమైతే నోటిఫికేషన్ రద్దు చేయడం లేదా సవరించి దరఖాస్తు చేసుకునేందుకు తగినంత గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నోటిఫికేషన్‌లో లోపాలపై ఆరోగ్యశాఖ కమిషనర్‌తో సమగ్ర విచారణ జరిపించి, నిబంధల ఉల్లంఘనలకు కారుకులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.