క్రాప్ సర్వే పూర్తయ్యేనా!
అయ్యింది 80 శాతమే.. ముగుస్తున్న సీజన్
- నెల రోజులు గడువు పెంచినా అసంపూర్తే..
- క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత
- గ్రామానికి ఒకరిద్దరే సర్వేయర్లు ‘యాప్’ నిబంధనలతోనూ ఇక్కట్లు
- సర్వే త్వరగా ముగించాలని రైతుల విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి) : వానాకాలం సీజన్ ముగింపు దశకు చేరినా.. పంటల డిజిటల్ క్రాప్ సర్వే(Telangana Digital Crop Survey) మాత్రం కొలిక్కి రావడం లేదు. నెల రోజులు గడువుపెంచినా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 80 శాతమే పూర్తయింది. రైతులు ఏ పంట సాగు చేశారు? ఎంత విస్తీర్ణం లో వేశారు? ఏ సర్వే నంబర్‌లో ఏ పంట ఉంది? అన్న వివరాలను నమోదు చేయాల్సిన ఈ ప్రక్రియకు సిబ్బంది కొరత అడ్డంకిగా మారింది.
సర్వే నంబర్ వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేయాలన్న నిబంధన, ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయడం వంటి కారణాలతో ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోం ది. దీనికి తోడు థర్డ్‌పార్టీ సర్వే విధానం, వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా జాప్యానికి కారణమని తెలుస్తోంది.
ఈ వానాకాలంకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 1,93,25,309 వ్యవసాయ క్షేత్రాల్లో సర్వే చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 1,46,67,370 (80శాతం) క్షేత్రాల సర్వే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా దాదాపు 46.58 లక్షల కేత్రాల్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంది.
సర్వే చేసేందుకు 10,164 మంది వలంటీర్లు రిజిస్టర్ కాగా, 9,820 మంది యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని సర్వే ప్రారంభించారు. కొన్ని జిల్లాల్లో 80 శాతం వరకు పూర్తి కాగా.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది.
20 మీటర్ల నిబంధనతో తిప్పలు..
పంటల సర్వే బాధ్యతలను విలేజ్ సర్వేయర్లకు ప్రభుత్వం అప్పగించింది. సాధారణ గ్రామానికి ఒకరు, మేజర్ గ్రామానికి ఇద్దరిని కేటాయించింది. గ్రామంలోని మొత్తం సర్వే నంబర్లను గుర్తించి, వాటి వద్దకు వెళ్లి సాగులో ఉన్న పంటను పరిశీలించి, ఫొటో తీసి, యాప్‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సంబంధిత సర్వే నంబర్ భూమి వద్దకు వెళ్లి పంటను పరిశీలించిన తర్వాతే యాప్‌లో వివరాలు నమోదు చేయాలి.
దీంతో ఒక్కరే సర్వేయర్ ఉన్న గ్రామంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. భూములు విస్తరించి ఉండటం, కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఉండటం, ఒక నంబర్ నుంచి మరో నంబర్‌కు వెళ్లడానికి సమయం పడుతుండటంతో రోజువారీగా పూర్తయ్యే సర్వే నంబర్ల సంఖ్య పరిమితంగా ఉంటుందని సర్వేయర్లు వాపోతున్నారు. అంతేకాదు.. 20 మీటర్ల దూరంలో సర్వే నంబర్ ఉంటేనే యాప్ ఓపెన్ అవుతుంది,
అప్పుడే వివరాలను నమోదు చేయడానికి వీలుంటుందని చెబుతున్నారు. ఫొటో యాప్‌లో అప్‌లోడ్, పంట రకం, విస్తీర్ణం వివరాల నమోదు దశలన్నీ ఎంట్రీ చేసిన తర్వాతే సర్వే నంబర్ పూర్తయినట్లవుతుంది. ప్రతి సర్వే నంబర్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు డేటా ఎంట్రీ కూడా చేయాల్సి రావడం, మరోవైపు సిబ్బంది కొరత వల్ల ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
థర్డ్‌పార్టీ సర్వేతోనే ఆలస్యం?
రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో పంట సర్వేలో వరి వివరాల నమోదుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పత్తి, మొక్కజొన్న, కంది, మినుము, పెసర, కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతుల వివరాల నమోదులో మాత్రం జాప్యం జరుగుతోందని సమాచారం. ఒకే గ్రామంలో పలు రకాల పంటలు సాగు అవుతున్నప్పుడు ప్రతి పంట వివరాన్ని సమగ్రంగా నమోదు చేయాల్సి ఉంటుంది.
వరి మినహా ఇతర పంటల వివరాలు వెనుకబడితే రాష్ట్రంలో వాస్తవ సాగు విస్తీర్ణానికి సంబంధించిన గణాంకాల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అన్ని పంటల నమోదును సమాన ప్రాధాన్యంతో చేపట్టాల్సిన అవసరం ఉంది. సర్వే నంబర్ గుర్తించి పంటను నమోదు చేయడంతో ప్రక్రియ పూర్తికావడం లేదు. సర్వే నంబర్‌లో ఉన్న సబ్‌డివిజన్ల (అ, ఆ, ఈ, ఉ..)ను కూడా గుర్తించి వాటి వారీగా వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఒకే సర్వే నంబర్లో రెండు, మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్‌డివిజన్లు ఉండటం, వాటిలో వేర్వేరు పంటలు సాగు చేయడం వంటి సందర్భాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు మరింత సమయం పడుతోంది. సబ్‌డివిజన్ వారీగా వివరాలు నమోదు చేయడంలో పొరపాటు జరిగితే భూమి విస్తీర్ణం, పంట రకం, సాగు విస్తీర్ణం వంటి వివరాల్లో వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉండటంతో సర్వేయర్లు జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తోంది.
ఇది కూడా సర్వే నెమ్మదించడానికి కారణమవుతోంది. అయితే పంట సర్వేలో థర్డ్‌పార్టీ సిబ్బందిని వినియోగించడం కూడా ప్రక్రియపై ప్రభావం చూపుతోందన్న చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో సర్వే బాధ్యతలు అప్పగించిన సిబ్బందికి యాప్ వినియోగం, సర్వే నంబర్ల గుర్తింపు, పంటల గుర్తింపు, సబ్‌డివిజన్ నమోదు వంటి అంశాలపై పూర్తి అవగాహన అవసరం. సమన్వయం లోపించినా, సాంకేతిక సమస్యలు ఎదురైనా సర్వే వేగం తగ్గే అవకాశం ఉంది.
కొరవడిన పర్యవేక్షణ?
సర్వే పనులు జరుగుతున్న తీరును మండల, జిల్లా స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది. ఏ గ్రామంలో ఎంత శాతం సర్వే పూర్తయింది? ఎన్ని సర్వే నంబర్లు పెండింగ్‌లో ఉన్నాయి? ఏ పంటల నమోదులో వెనుకబాటుతనం ఉంది? సబ్‌డివిజన్ వారీగా ఎక్కడ సమస్యలు ఉన్నాయి? అనే వివరాలను రోజువారీ గా సమీక్షించాల్సి ఉంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ ఆశించిన స్థాయి లో లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కేవలం యాప్‌లో నమోదైన సంఖ్యలను పరిశీలించడం కాకుండా.. వాస్తవంగా క్షేత్రస్థాయిలో సర్వే జరుగుతోందా? నమోదైన పంట వివరాలు సరైనవేనా.. ? అన్నది తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశగా చర్యలుచేపట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. పంట సర్వే వివరాలు కేవలం ప్రభుత్వ గణాంకాలకే కాకుండా వ్యవసాయ ప్రణాళిక, పంటల అంచనాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక అంశాలకు కీలకం.
రైతు సాగుచేసిన పంట సర్వేలో నమోదు కాకపోతే సంబంధిత రికార్డుల్లో వ్యత్యాసాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల సర్వేను త్వరగా పూర్తి చేయడమే కాకుండా, నమోదైన వివరాలు వాస్తవ సాగుకనుగుణంగా ఉన్నాయా? అన్నది నిర్ధారించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
ఇప్పటికే ప్రభుత్వం యాప్ లో పంటల నమోదుతోనే కొనుగోలు చేస్తామన్న నేపథ్యంలో రైతులు ఆందో ళనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పం దించి పంట వివరాలను ఇకనైనా పెం డింగ్ సర్వే నంబర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి అదనపు సిబ్బందిని రంగంలోకి దించి, అన్ని పంటల వివరాలు నమోదు చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు.