నిరుద్యోగులను ముంచిన రేవంత్

19-10-2026 | 05:25am
  1. టామ్‌కామ్ ద్వారా వీసాలు, పరీక్షల పేరిట యువత నుంచి రూ.4.5 లక్షలు వసూళ్లు
  2. ఒక్కరికి కూడా కొలువు చూపని ప్రభుత్వం
  3. మాజీమంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): జర్మనీలో కొలువుల పేరిట ప్రభుత్వ రంగ సంస్థ టామ్‌కామ్ ద్వారా నిరుద్యోగ యువతను రేవంత్‌రెడ్డి సర్కార్(Revanth Reddy government) నిలువునా ముంచిందని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) మండిపడ్డారు. 15 జిల్లాల్లోని 75 మంది నిరుద్యోగుల నుంచి వీసా లు, పరీక్షల పేరిట ఒక్కొక్కరి వద్ద దాదాపు రూ.4.5 లక్షలు వసూలు చేసి రెండేళ్లుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో హరీశ్‌రావు పేర్కొన్నారు.

ప్రభుత్వం మాట నమ్మి రైతులు తల్లులు, భార్యల మెడల్లోని పుస్తెలతాళ్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుకు ఇప్పటికీ వడ్డీలు కడుతూ రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లు గడిచినా 75 మందిలో ఏ ఒక్క అభ్యర్థికీ జర్మన్ కంపె నీతో కనీసం ఇంటర్వ్యూ కూడా ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

బీ1 లాంగ్వేజ్ పరీక్ష పాసైన వారికి మళ్లీ బీ2 అంటూ కొర్రీలు పెడుతున్నారని, తొమ్మిది మంది జర్మనీకి వెళ్తున్నారని ఘనంగా ప్రచారం చేసుకుని తీరా ఒక్కరినీ పంపించలేదని మండిపడ్డారు. ఏదైనా సమస్య వస్తే 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్నో కోర్టుకు వెళ్లాలని అమాయక యువతతో బలవంతంగా సంత కాలు పెట్టించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టామ్‌కామ్ ద్వారా విదేశాల్లో ఎందరికి ఉద్యోగాలు

ఇచ్చారో ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగినా, చట్టబద్ధమైన గడువు దాటినా ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడం శోచనీయమని విమర్శించారు. బాధితులు న్యాయం కోసం ఏడుస్తుంటే, కార్మికశాఖ మంత్రి మాత్రం మొన్న జూన్‌లో మరో కొత్త బ్యాచ్‌ను ప్రారంభిస్తూ ఉద్యోగాలంటూ మాయమాటలు చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?, మీరిచ్చిన జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.

టామ్‌కామ్ వసూలు చేసిన ప్రతి పైసాను బాధితులకు వెంటనే వాపస్ ఇవ్వాలని, రెండేళ్ల విలువైన కాలం వృథా చేసినందుకు, తెచ్చిన అప్పుల వడ్డీల భారం, మానసిక క్షోభకు గురిచేసినందుకు ఒక్కో అభ్యర్థికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మోసపోయిన బాధితులందరికీ ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలన్నారు. టామ్‌కామ్ కుంభకోణంపై వెంటనే సీఐడీ లేదా న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు.

ఇప్పటివరకు ఎంత ఫీజు వసూలు చేశారు? ఎంతమందికి విదేశీ ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని హెచ్చరించారు. 

రైతు కూలీల బిడ్డలు డాక్టర్లు కావడంపై హర్షం

నారాయణఖేడ్ నియోజకవర్గం, పలుగు తండాకు చెందిన ఉద్యమకారులు, నిరుపేద రైతు కూలీలైన వాడిత్య యాదు నాయక్, పాపీబాయి దంపతుల కుమార్తెలు వాడిత్య నివేదిత, వాడిత్య అఖిల ఇద్దరూ డాక్టర్లు కావడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వారు ఎంబీబీఎస్ సీట్లు సాధిం చి కుటుంబ సమేతంగా వచ్చి నన్ను కలవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు.

పేదరికం ప్రతిభకు అడ్డంకి కారాదనే బలమైన సంకల్పంతో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా వందలాది గురుకులాలను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించారని గుర్తు చేశారు. దానికితోడు జిల్లాకో మెడికల్ కాలేజీని నెలకొల్పి రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లను 2,850 నుంచి 10,000 పైచిలుకు పెంచిన విప్లవాత్మక నిర్ణయం నేడు క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తోందనానరు.

నాడు తెలంగాణ పోరాటంలో పిడికిలెత్తిన ఉద్యమకారుల బిడ్డలు.. నేడు కేసీఆర్ విద్యా సంస్కరణల ఫలితంగా స్టెతస్కోప్ పట్టుకొని సమాజ సేవకు సిద్ధమవుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. నివేదితకు, అఖి భవిష్యత్తులో ఉన్నత వైద్యులుగా ఎదిగి, పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కోరారు. 


మరిన్ని వార్తలు