ట్యాంక్ బండ్.. పూల సింగిడి
- ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురం
- రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ
- తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడిన ఆడబిడ్డలు
- హాజరైన గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు, మంత్రులు సీతక్క, జూపల్లి
- భర్త విజయ్ దేవరకొండతో వచ్చి బతుకమ్మ ఆడిన సినీ నటి రష్మిక
- నీటిని పొదుపుగా వాడుకుందామని గవర్నర్ పిలుపు
ముషీరాబాద్, అక్టోబర్18 (విజయక్రాంతి): హైదరాబాద్లోని ట్యాంక్ బండ్(Tank Bund) పూలవనమైంది. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’.. పాటలతో ఉయ్యాలలూగింది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుకొని ఆడబిడ్డలు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా దంపతులు హాజరయ్యారు. హుస్సేన్షాగర్లో ఏర్పాటు చేసిన లేజర్ షో ఆకట్టుకుంది. పరిసరాలన్నీ పూల సింగిడిని తలపించాయి.
బతుకమ్మలతో ర్యాలీగా..!
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఆడబిడ్డలు ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలకు తరలివచ్చారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి. తొలుత అమరవీరుల స్మారకం వద్ద ఆడబిడ్డలు బతుకమ్మలను పేర్చారు. అక్కడ మంత్రి సీతక్క గౌరీపూజ నిర్వహించారు.
ఆ తర్వాత ఆటపాటలతో కళాకారులు ముందుకు కదలగా.. బతుకమ్మలతో మహిళలు ర్యాలీగా ట్యాంక్ బండ్ వరకు చేరుకున్నారు. అక్కడ ఆడిపాడి.. అనంతరం బతుకమ్మ ఘాట్లో నిమజ్జనం చేశారు. ‘పసుపుల పుట్టిన గౌరమ్మ.. పసుపుల పెరిగిన గౌరమ్మ.. పసుపుల వసంతమాడంగా.. పోయిరా బతుకమ్మ’ అంటూ గంగమ్మ ఒడికి బతుకమ్మను చేర్చారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
ఆకట్టుకున్న లేజర్ షో, స్టాళ్లు
ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో, స్టాళ్లు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతోపాటు బతుకమ్మ విశిష్టతను తెలిపేలా లేజర్ షో ప్రదర్శించారు. చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఆహార పదార్థాలు, సంప్రదాయ ఉత్పత్తులతో స్టాళ్లను ఏర్పాటు చేశారు.
త్వరలో ‘ప్రభాత భేరి’: జూపల్లి
సమాజంలో ఆర్థిక క్రమశిక్షణ, ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి కుటుంబంలో సంతోషం శాశ్వతంగా ఉండాలంటే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అవసరం ఉన్నా లేకున్నా అనవసర ఖర్చులు చేయడం, గొప్పలకు పోయి అప్పులు చేయడం వల్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నాయని పేర్కొన్నారు.
విద్య, వైద్యం వంటి ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యమిస్తూ, అవసరాలకు తగ్గట్టు ఖర్చులు చేయాలని సూచించారు. ప్రతి ఆడబిడ్డ ముఖంలో పండుగ రోజు కనిపించే సంతోషం ఏడాది పొడవునా ఉండాలంటే సమాజంలో ఆలోచనా విధానంలో మార్పు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యంతో సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో త్వరలో ‘ప్రభాత భేరి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతలను ప్రభుత్వాలు మాత్రమే పూర్తిగా నియంత్రించలేదని, ప్రజలందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు.
సంస్కృతిని కాపాడుకోవాలి: సీతక్క
బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని మంత్రి సీతక్క అన్నారు. ఎన్ని కష్టాలు, కరువు పరిస్థితులు ఎదురైనా తెలంగాణ మహిళలు మొక్కవోని ధైర్యంతో తమ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారని ఆమె తెలిపారు.
కుటుంబాల్లోనే కాకుండా మహిళలు పనిచేసే ప్రతి చోటా వారికి తగిన గౌరవం, ఆదరణ లభించాలన్నారు. బతుకమ్మ పండుగ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ.. దూరమైన బంధుమిత్రులను కలిపే వేడుకగా నిలుస్తుందని సీతక్క పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని పట్టణాలు, పల్లెల్లో సమానంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
నీటి వృథాను అరికడుదాం: గవర్నర్
ప్రకృతి, జలవనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. నీటి వృథాను అరికట్టి, జలవనరులను సంరక్షించుకోవడాన్ని ప్రతి పౌరుడు తన బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు. ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ మాట్లాడారు. ‘తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి, మహిళా శక్తికి, ప్రకృతిపై ప్రజలకున్న ఆరాధనా భావానికి బతుకమ్మ ప్రతీక’ అని గుర్తుచేశారు.
ఎల్ నినో వంటి వాతావరణ పరిణామాల నేపథ్యంలో ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకత మరింత పెరిగిందన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదవడం భవిష్యత్తులో ఎదురయ్యే నీటి సంక్షోభానికి హెచ్చరికగా భావించాలని ఆయన సూచించారు. నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చిన తర్వాత చర్యలు చేపట్టడం కంటే ముందుగానే నీటి పొదుపును అలవాటు చేసుకోవడం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో నీటిని పొదుపుగా వినియోగించాలని, వృథాను అరికట్టేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు.
పెళ్లయిన తర్వాత మొదటి బతుకమ్మ: రష్మిక
ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా దంపతులు పాల్గొన్నారు. మహిళలతో కలిసి రష్మిక బతుకమ్మ ఆడారు. అనంతరం స్టేజీపై ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లయిన తర్వాత నాకు ఇది మొదటి బతుకమ్మ. ఎక్కడ పెద్ద బతుకమ్మ ఆడుతారో అక్కడికి తీసుకెళ్తానని విజయ్ చెప్పారు. చెప్పినట్లుగానే ఇక్కడికి తీసుకొచ్చారు.
ఇంట్లో అత్తమ్మతోపాటు అందరూ బతుకమ్మ ఆడుతారు. వారి నుంచి కొంచెం నేర్చుకున్నాను. ఇప్పుడు తెలంగాణ కోడలుగా బతుకమ్మ ఆడటం సంతోషంగా ఉంది. పెళ్లి కాక ముందు రష్మిక మేడమ్, రష్మిక అక్క అని పిలిచేవారు.
ఇప్పుడు మాత్రం అందరూ వదిన అని.. పిల్లలైతే అత్త అని పిలుస్తున్నారు. చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. నాకు పెద్ద ఫ్యామిలీలోకి వచ్చినట్లు ఉంది. దేవుడు అందరినీ బాగా చూడాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. కార్యక్రమంలో నటుడు విజయ్ దేవరకొండ, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తదితరులు ప్రసంగించారు.