భక్తి విశ్వాసాల కనకదుర్గ
అల్లరి నరేశ్(Allari Naresh's), కాజల్ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘కనకదుర్గ’(Kanaka Durga). ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు. బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ పతాకాలపై అజిత్ ఠాకూర్, బీవీఎస్ రవి నిర్మిస్తున్నారు. శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఈ చిత్రం నుంచి తొలి పాట ‘అమ్మ కనకదుర్గ’ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను తమన్ స్వరపర్చగా, సిరాశ్రీ సాహిత్యం అందించారు.
ఈ గీతావిష్కరణ కార్యక్రమంలో హీరో అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. “నేను తొలిసారి ఈ భక్తిరస చిత్రంలో నటిస్తున్నా. సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధం చేస్తున్నాం” అన్నారు. నిర్మాతలు అజిత్ ఠాకూర్, బీవీఎస్ రవి మాట్లాడుతూ.. “భక్తి విశ్వాసాల నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పాట విడుదల ఒక అర్థవంతమైన తొలి అడుగు” అని చెప్పారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “ఈ పాట కేవలం ఓ సంగీత రచనలా కాకుండా.. భక్తుడు అమ్మవారిని ప్రార్థించే సమయంలో కలిగే గాఢమైన భావోద్వేగాన్ని, అమ్మవారి అపారమైన శక్తిని, కరుణను ప్రతిబింబించేలా ఉండాలని కోరుకున్నా” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిర్లా స్టూడియోస్ సహ నిర్మాత సునీల్ చైనాని, జీ మ్యూజిక్ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుజల్ పరేఖ్ పాల్గొన్నారు.