నేరాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు...
వేలాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ లో సీఐ నవీన్ కుమార్
జైపూర్, (విజయక్రాంతి): నేరాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవనీ సీఐ నవీన్ కుమార్ (CI Naveen Kumar)హెచ్చరించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ (Jaipur Police Station) పరిధిలోని వేలాల గ్రామంలో జైపూర్ ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో సీఐ మాట్లాడారు. గంజాయి, ఇతర మత్తుపదార్థాల వినియోగం, నిల్వ, సరఫరా, అక్రమ రవాణా, విక్రయం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రజలను భయాందోళనలకు గురిచేసే, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వినాయక చవితి సందర్భంగా నిర్వహించే ఉత్సవాలు, శోభాయాత్ర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో 62 మోటార్ సైకిళ్లు,5 ఆటోలు,1 కారు,1 ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.