ముగిసిన ఆటోక్యాడ్ శిక్షణ
- 43 మంది మైనింగ్ విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆటో క్యాడ్ శిక్షణ ముగిసింది. మైనింగ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MEAI), హైదరాబాద్ చాప్టర్ వారి సహకారంతో అక్టోబర్ 29 చేపట్టారు. బుధవారం ఆటోక్యాడ్ శిక్షణ కార్యక్రమం ముగిసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాలకు చెందిన మైనింగ్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న 43 మంది విద్యార్థులకు ఆటోక్యాడ్ సాఫ్ట్‌వేర్‌పై ప్రాయోగిక శిక్షణ అందించారు. ఆధునిక మైనింగ్ రంగంలో మైన్ ప్లానింగ్, డిజైనింగ్, సర్వే డ్రాయింగ్స్ తదితర అంశాలలో ఆటోక్యాడ్ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ముగింపు కార్యక్రమానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ(SCCL General Manager Radhakrishna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
MEAI హైదరాబాద్ చాప్టర్ చైర్మన్, BGR Mining & Infra Ltd. డైరెక్టర్ బాలకోటి రెడ్డి, MEAI కార్యదర్శి ఎల్. కృష్ణ, మందమర్రి ఏరియా డీజీఎం వేముల మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఆటోక్యాడ్ వంటి సాఫ్ట్వేర్లపై ప్రాయోగిక పరిజ్ఞానం ఉద్యోగావకాశాలను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఆటోక్యాడ్ శిక్షకులు దినకర్ శిక్షణలో విద్యార్థులకు వివిధ సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమలు విద్యాసంస్థల మధ్య సమన్వయం ద్వారా విద్యార్థులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించవచ్చని పేర్కొంటూ, MEAI, SCCL సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ సమన్వయకర్త బి. శ్రీనివాస్ శిక్షణ కార్యక్రమ నివేదికను సమర్పించారు. అనంతరం శిక్షణ పొందిన 43 మంది విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, మైనింగ్ విభాగ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.